సెల్‌ రింగవుతోంది...‘హలో?’.‘మీనాక్షీ...?’ అన్నది అవతలి గొంతు.‘ఎవరూ?’ అనుమానంగా అంది ప్రీతి.‘‘ఎవరది?’’ అని సెల్‌ఫోన్‌ లాక్కోబోయాడు అమిత్‌.‘‘ఎవరో చెప్పకుండా కట్‌ చేశాడులే’’ అంది ప్రీతి ఫోన్‌ ఆఫ్‌ చేస్తూ.

‘‘పోలీసులా కొంపదీసి? దాని సెల్‌ నుంచే దాని మదర్‌తో మాట్లాడామే? నీ నంబర్‌ కెలా వస్తున్నాయి కాల్స్‌?’’ అన్నాడు అమిత్‌.‘‘కాల్‌ చేసింది పోలీసే అని ఎలా అంటావ్‌?’’ అని ఎదురు ప్రశ్నించింది.అతడికి ఒళ్ళు మండిపోయింది- ‘‘మార్నింగ్‌ మీనాక్షి మదర్‌ నీకెలా కాల్‌ చేసింది? నీ నంబర్‌ ఆమెకెలా తెల్సింది? ఆమె చేస్తే మీనాక్షి నంబర్‌కే చేయాలి, మీనాక్షి సెల్‌ని చితగ్గొట్టేశాం. నీ సెల్‌కెలా చేసిందామె కాల్‌? అంటే నువ్వే మీనాక్షి సిమ్‌నీ...’ అంటూ ఆమెకేసి అనుమానంగా చూశాడు.

ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ సతర్దేకర్‌ ఫోన్లో చెప్పసాగాడు... ‘‘అలాగే ట్రాక్‌ చేస్తూ ఉండు, విక్టిమ్‌ సెల్‌ని కన్ఫాం చెయ్‌. సిమ్‌ కార్డు కిడ్నాపర్స్‌ యూజ్‌ చేస్తూంటే ఆ సెల్‌ని ఐడెంటిఫై చెయ్‌. మీనాక్షి డేంజర్‌లో ఉందని నా అనుమానం...’’మీనాక్షి మదర్‌ సర్వాక్షి క్షణమొక యుగంలా గడుపుతోంది. నిన్న మీనాక్షిని కిడ్నాప్‌ చేశామని ఫోన్‌ చేశాడొకడు. పదిహేను లక్షలు డిమాండ్‌ చేశాడు. ఇవ్వకపోతే మీనాక్షితో పోర్న్‌ ఫిలిమ్స్‌ తీస్తామని బెదిరించాడు. అంత డబ్బు తనదగ్గర లేదని, అరవై వేలే ఇవ్వగలనని చెప్పిందామె. అంతే, ఆ డబ్బుతీసుకుని మళ్ళీ ఫోనే ఎత్తడం లేదు. మీనాక్షి ఏమైందో తెలియడం లేదు.పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది.

క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కి కొత్త సమాచారమందింది- మీనాక్షి కాల్‌ రికార్డ్స్‌ని బట్టి చూస్తే నిన్న ఆమె గోరఖ్‌పూర్‌లో ఉన్నట్టు తెలుస్తోందని, అదే ఈ రోజు చూస్తే ముంబయిలో ట్రేస్‌ అవుతోందని ఆ సమాచారం.

‘‘ముష్టి అరవై వేలకి ఇదంతా చేసింది నువ్వు! దానికోసం ఎవరెవరు కాల్స్‌ చేస్తున్నారో తెలుసుకుని జాగ్రత్త పడ్డానికి సిమ్‌ తీసి పెట్టుకుంటే తప్పేంటి? నన్నే కొడతావా?’’ అని లాగి తన్నింది అమిత్‌ని ప్రీతి.సిమ్‌ నామరూపాల్లేకుండా కింద పడుంది.