ఎప్పట్లానే ఆ శనివారం ఉదయం చిన్నన్నయ్యకి ఫోన్‌ చేసాను.మొదటి రింగ్‌ కే ఎత్తి ‘‘నీ ఫోన్‌ కోసమే చూస్తున్నానే జ్యోతీ .. పెద్ద ఘోరం జరిగిపోయింది. పెద్దన్నయ్యని పట్టలేక పోతున్నాం. అన్నట్టు, ఇప్పుడు మేమంతా మన ఊళ్లోనే ఉన్నాం .. ’’ అన్నాడు ఏడుపు గొంతుతో.‘‘ఏమయిందిరా ..’’ వణికే స్వరంతో కీచుగా అరిచాను, ఏదో కీడు శంకిస్తూ.

‘‘మన కావ్య ... తన క్లాస్‌మేట్‌ నెవర్నో లవ్‌మ్యారేజ్‌ చేసేసుకుని వెళ్లిపోయిందటే ..’’.ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది.‘‘ఎప్పుడన్నయ్యా ..?’’ ఎలాగో గొంతు పెగుల్చుకుని అడిగాను.‘‘రెండ్రోజులయ్యింది ... విషయం తెలిసినప్పట్నుంచి పెద్దన్నయ్య పచ్చి మంచినీళ్లు కూడా ముట్టట్లేదు .. హాస్పిటల్లో ఉన్నాడు. సెలైన్‌ ఎక్కిస్తున్నారు. వదిన కూడా మంచం దిగట్లేదు. ఏదో పిల్ల తెలివైంది, బాగా చదివిద్దామనుకుంటే .. కొంప ముంచింది’’ అన్నాడు బాధగా.‘‘ఆ మధ్య నేను ఫోన్‌ చేసినప్పుడు, ఎమ్మెస్సీ సీట్‌ దొరుకుతుందో లేదో అత్తయ్యా అని బాధపడిందిరా ..’’ అంటుంటే నాకూ ఏడుపొచ్చేసింది.మరి కొంతసేపు కావ్య గురించే మాట్లాడి ‘‘మళ్ళీ చెయ్యవే..’’ అంటూ ఏదో అర్జెంట్‌ పనున్నట్టు ఫోన్‌ కట్‌ చేశాడు.శ్రీనివాస్‌కి విషయం చెప్పాలా వద్దా అనే మీమాంసలోనే చెప్పేశాను.

ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి, తర్వాత చిరునవ్వుతో ‘‘అంత కంగారెందుకూ .. ఆ కుర్రాడు కూడా కావ్యతో పాటు డిగ్రీ చదువుతున్నాడుగా ... ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుని ఎంచక్కా బతుకుతార్లే’’ నా భావోద్వేగాలేవీ పట్టనట్టు, చాలా క్యాజువల్‌గా బదులిచ్చాడు. ఆయన తీరే అంత. ఎంత ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడో తెలిసిన దాన్ని గనక ఆ విషయం పొడిగించకుండా అంతటితో ఆపేశా.ఆ మర్నాటినుండి ప్రతి రోజూ చిన్నన్నయ్యకి ఫోన్‌ చేస్తూనే ఉన్నాను. పెద్దన్నయ్య కొడుకు సూర్యతో కూడా మాట్లాడా ... వాడు టెన్త్‌ చదువుతున్నాడు. మరో రెండ్రోజుల తర్వాత పెద్దన్నయ్యని ఇంటికి తీసుకొచ్చారని, బీ.పీ., షుగరూ కంట్రోల్లోకి వచ్చాయని చెప్పారు.కావ్య విషయం తెలిసినప్పటినుంచీ పెద్దన్నయ్యతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. తనూ, వదినా ... ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడడం లేదని చెప్పాడు చిన్నన్నయ్య.