ఉదయం నుంచీ మెసేజ్‌ల ద్వారా, మరికొంతమంది నేరుగా ఫోన్‌చేసి అభినందనలు తెలుపుతున్నారు. పోటీలో బహుమతి వచ్చిన నా కథ ఓ ప్రముఖ వారపత్రికలో ప్రచురించబడింది. అందులో నా పరిచయం, ఫోటోతోపాటు మొబైల్‌ నంబర్‌ కూడా ఇవ్వడంవల్ల కథ బావుందని చాలామంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఏ రచయితకైనా విస్కీకన్నా మత్తు కలిగించే మధువు ప్రశంస కాక మరేముంటుంది? కథ చదివిన తోటి యూనివర్సిటీ విద్యార్థులూ, లెక్చరర్లు కూడా అభినందనలు తెలిపారు. ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు నా వాట్సప్‌కి ఓ మెసేజ్‌ వచ్చింది. ‘‘మీ కథ హృదయాన్ని కదిలించింది. నేను మీ అభిమానిని. ఇప్పటివరకూ పత్రికల్లో వచ్చిన మీ ప్రతి కథా చదివాను. ఇంత చిన్నవయసులో అంతటి పరిణతితో కథలు రాయటం మీకెలా సాధ్యపడింది? నాకైతే మీ చేతుల్ని కళ్ళకు అద్దుకోవాలని ఉంది. మీ వేళ్ళు ముద్దుపెట్టుకోవాలని ఉంది’’ మెసేజ్‌ కింద పేరు లేదు.ఆడో మగో అర్థం కాలేదు. ఎంత వయసో ఏ ఊరో తెలియటం లేదు. ఓ క్షణం ఆ నంబర్‌కి ఫోన్‌చేసి థ్యాంక్స్‌ చెప్పాలనుకున్నా. మళ్ళా మనసు మార్చుకుని ‘‘ధన్యవాదాలు’’ అని మెసేజ్‌ పెట్టాను.

మరునాడు ఉదయం లేవగానే మొబైల్‌చూస్తే వాట్సప్‌లో అదే నంబర్‌ నుంచి మరో మెసేజ్‌ ఉంది.‘‘మీ నుంచి మెసేజ్‌ వస్తుందని ఊహించలేదు తెలుసా.. మీ వంటి గొప్పరచయిత నాలాంటి సామాన్యురాలి అభినందన పట్టించుకోవాల్సిన అవసరమేలేదు. అది మీ సహృదయతకు నిదర్శనం. నాకు అత్యంత ఇష్టమైన రచయిత ఇచ్చిన ఆటోగ్రాఫ్‌ కదా. గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. రోజూ ఉదయం లేవగానే నేను చేసే మొదటి పనేంటో తెలుసా? మీ అందమైన మొహాన్నిచూడటం... మీ ఫొటోల్ని పత్రికల్లోంచి కత్తిరించి పటం కట్టించి నా దిండుకింద పెట్టుకున్నాలెండి. మరో విషయం. మా ఇంట్లో దేవుళ్ళ పటాలుండవు’’.