‘ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాలీ నేర్చుకోను’ అనుకున్నాను నాలో నేను.నిజానికి బెంగాలీ నేర్చుకోమని అశుతోష్‌ నన్నేమీ అడగలేదు. ఒకవేళ తనే స్వయంగా అడిగి ఉంటే మా పెళ్ళైన తరువాత ఈ రెండేళ్ళలో నన్ను కోరిన మొదటి కోరిక కనుక సరే అనేదాన్నేమో!అవునూ... మొదటి కోరిక ఎలా అయ్యిందీ! రెండోది కదూ!‘చటర్జీ’ అన్న తన పేరు నాపేరు చివర తగిలించుకోమని అడిగాడుగా ... అది మొదటి కోరిక కదా!అడిగాడా? ఎక్కడడిగాడు? ‘తగిలించుకో..’ అని ఆర్డర్‌ వేశాడు. కనుక అది కోరిక కాదు. ఆజ్ఞ!త్రేతాయుగం స్త్రీ రెండు వరాలు పొందవచ్చును. కలియుగపు స్త్రీ రెండు వరాలు తీర్చననవచ్చును.

‘భాగీరథి రెడ్డి’ కాస్తా ‘భాగీరథి చటర్జీ’గా మారిపోతే ఎలా? మన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌కి ఎవడిదో డిస్‌ప్లే పిక్‌ పెట్టినట్లుండదూ!చేపల పులుసు చేశాను ... వాళ్ళ బెంగాలీ స్టయిల్లో చెయ్యమంటాడు.‘‘ఎందుకు చెయ్యను ... అత్తయ్య గారికి ఫోన్‌ చేసి ఇవ్వు. ఎలా చెయ్యాలో అడుగుతాను. అత్తయ్యగారే నాతో మాట్లాడకపోతే బెంగాలీ చేపల పులుసు నాకెవరు నేర్పుతారు?’’ అని అడుగుతాను.‘‘మన పెళ్ళిని వాళ్ళింకా ఒప్పుకోవడం లేదు’’ అని ఇంగ్లీష్‌లో దీనంగా చెప్తాడు.అవును మరి, ఇంటర్‌ క్యాస్టే ఒప్పుకోరు. మాది ఇంటర్‌ స్టేట్‌ కూడా. బెంగాలీ బ్రాహ్మర్లబ్బాయి, బొబ్బర్లంక రెడ్ల అమ్మాయి. టూమెనీ క్వారల్స్‌ అండ్‌ కాంప్లికేషన్స్‌.‘‘గూగుల్‌ ఇట్‌’’ అన్నాడు.

యూట్యూబ్‌లో చూసి మర్నాడు చేపల పులుసు చేస్తే అది నీరు పట్టేసి వికారంగా తయారయ్యేసరికి మళ్ళీ బెంగాలీ వంటల జోలికి వెళ్ళొద్దని వార్నింగ్‌ ఇచ్చి కారెక్కి ఆఫీసు కెళ్ళిపోయాడు.అలా నా ప్రేమ ‘నీరు’గారిపోయింది.పొద్దున్న వంటయ్యాక అమ్మ ఫోన్‌ చేస్తుంది. అల్లుడు ఎలా ఉన్నాడని అడుగుతుంది అన్యమనస్కంగా. నాన్నగారు ఇంట్లో ఉన్నా పొలానికెళ్ళారంటుంది. ఆరోగ్యం బాగోలేకపోయినా బాగున్నాం అంటుంది. నేను చేసిన పనివల్ల చెల్లికి మంచి సంబంధాలు రావేమోనని బెంగపడుతున్నానంటుంది. ఫోన్‌ పెట్టబోయేముందు ‘బెంగాలీ నేర్చుకుంటున్నావా?’ అని అడిగి మరీ పెట్టేస్తుంది.నేర్చుకోవాలా? నేను నేర్చుకోను. అలా అని బెంగాలీ అంటే ఇష్టం లేదని కాదు. తెలుగంటే ఇష్టమని. తెలుగువారి అస్తిత్వాన్ని కాపాడదామని. ఇంతటి గురుతర బాధ్యత నాకెందుకనా?