ఋతువులు మారుతున్నా, గ్రీష్మతాపం వర్ష ఋతువులోకి కూడా చొచ్చుకుని వస్తూనే ఉంది. నుదుటికి పట్టిన స్వేదాన్ని జేబురుమాలుతో అద్దుకుని వడివడిగా ఆ భవనంలోకి ప్రవేశించాడు ఆదిత్య. ఆరోజు అతనికి ఆ ఆఫీసులో ఒక ఇంటర్వ్యూ ఉంది. అది బాగా పేరున్న ఒక దినపత్రిక కార్యాలయం. అక్కడ ఆర్టికల్‌ రైటర్‌గా చేరడానికి ప్రయత్నిస్తూ ఒక అప్లికేషన్‌ పెట్టాడు ఆదిత్య. మెయిల్‌ కూడా పంపించాడు. ఆ మెయిల్‌కి స్పందిస్తూ, ఇంటర్వ్యూకి రమ్మని అతనికి పిలుపువచ్చింది. ఇంటర్వ్యూ సమయానికి అరగంట ముందుగానే ఆఫీసులోకి ప్రవేశించాడు ఆదిత్య. తను అనుకున్నది సాధించడానికి ఎటువంటి అవరోధాలూ రాకుండా జాగ్రత్త పడటం అతనికి అలవాటు.

రిసెప్షన్‌ దగ్గరకువెళ్ళి అక్కడ కూర్చున్న అబ్బాయికి తనకు వచ్చిన ఈ–మెయిల్‌ ఉన్న ప్రింటెడ్‌ కాగితం చూపించాడు ఆదిత్య. తన దగ్గర ఉన్న అపాయింట్‌మెంట్స్‌ లిస్టులోని వివరాలు సరిచూసుకుని ఆదిత్యను లాంజ్‌లో కూర్చోమని చెప్పాడతను. విజిటర్స్‌ లాంజ్‌లోకి వెళ్ళి కూర్చున్న ఆదిత్యకు అప్పటికే అక్కడ మరికొందరు కూర్చుని ఉండటం కనిపించింది. కానీ వారిలో ఎవరు ఉద్యోగంకోసం వచ్చారో ఎవరు వేరే పనిమీద వచ్చారో తెలియలేదు. అక్కడ ఉన్నవాళ్ళందరూ నడివయసు దాటినవాళ్ళే. ఒకవేళ వాళ్ళంతా కూడా ఉద్యోగం కోసమే అయితే బాగా సీనియర్‌ పొజిషన్స్‌ కోసం వచ్చి ఉండాలి, లేదా వేరే పనులమీద వచ్చి ఉండాలని ఊహించాడు ఆదిత్య.

తన బ్యాగ్‌ తెరచి అందులోనుంచి ఒక ఫోల్డర్‌ తీశాడు ఆదిత్య. ఆ ఫోల్డర్‌లో ఉన్న సర్టిఫికెట్స్‌, వాటితోపాటూ తను రాసిన ఆర్టికల్స్‌ కాగితాలు ఒకసారి చూసుకున్నాడు. ఇంటర్వ్యూలో ఏ ఏ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో ఊహించడానికి ప్రయత్నించాడు. అప్పుడు తను ఎలాంటి సమాధానాలు చెబితే ఇంటర్వ్యూ చేసేవారిని ఇంప్రెస్‌ చెయ్యవచ్చో ఆలోచించాడు.‘‘సార్‌, మిమ్మల్ని రమ్మంటున్నారు’’ బోయ్‌ దగ్గరగా వచ్చి ఆదిత్యను పిలిచాడు.‘‘ఆఁ వస్తున్నా’’ అంటూ తన బ్యాగ్‌ భుజానికి తగిలించుకుని, ఫోల్డర్ చేతిలో పట్టుకుని లేచినుంచున్నాడు. ఒక్కసారి ఊపిరి బలంగా తీసుకుని అర క్షణం కళ్ళుమూసుకుని లేనిపోని భయాలు, అనవసరపు ఆలోచనలు అక్కడే వదిలేసి, ఆత్మవిశ్వాసంతో బోయ్‌ వెంట నడిచాడు ఆదిత్య.