ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కొత్తరూపాలను బతికించుకోవాలంటే పాత కళలు, వాయిద్యాలను కాపాడుకోవాలని మూలధ్వని డైరెక్టర్‌ ప్రొ.జయధీర్‌ తిరుమలరావు అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియంలో ట్రైబల్‌ అండ్‌ పోక్‌ మ్యూజిక్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్న ట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో అంతరించిపోతున్న బుర్రవీణ, కిక్రి, పన్నెండు మెట్ల గోండీ కిన్నెర, కడ్డీవాద్యం తదితర వాయిద్యాలుంటాయన్నారు. రాష్ట్రంలో ఉన్న మూలాలు, మూలధ్వనులు అంతరించిపోతున్నాయని, మిగిలిన వాటినైనా భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు.ఓయూ తెలుగు, ఇంగ్లిష్‌, జర్నలిజం, ఈఎంఆర్‌సీ శాఖల ఆధ్వర్యంలో గురువారం వర్సిటీ దూరవిద్యా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొ.జయధీర్‌ తిరుమలరావు, ఓయూ జర్నలిజం ప్రొ.స్టీవెన్‌సన్‌ మాట్లాడా రు. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గుర్తించిన 66 వాద్యాల నుంచి సుమారు 52 వాయిద్యాలను తొలిసారిగా ఒకే వేదికపై పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. పాత వాద్యాలు కనుమరుగు కాకుండా ఉండాలంటే వీటిపై ప్రముఖంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్‌ విభాగం ప్రొఫెసర్లు విజయ్‌కుమార్‌, యాదవరాజు, పుట్లపల్లి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.