నల్లకుంట, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని యువకళావాహిని, శృతిలయ ఆర్ట్స్‌, సీల్‌వెల్‌ అశ్విని సంస్థల ఆధ్వర్యంలో ‘గాంధీ పుట్టిన దేశం’ శీర్షికన సినీ సంగీత విభావరి 5వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సంస్థల నిర్వాహకులు వై.కె.నాగేశ్వరరావు, ఆర్‌.ఎన్‌.సింగ్‌, ఆమని వెల్లడించారు. మంగళవారం హైదర్‌గూడలో విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్యకు మహత్మాగాంధీ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఏపీ శాసనమండలి పూర్వ అధ్యక్షుడు చక్రపాణి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి, ప్రముఖ సినీ నటి జమున, గీతాంజలి, సీల్‌వెల్‌ సుబ్బారావు, అశ్విని సుబ్బారావు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఆరాధన వెంకటరెడ్డి, నిర్మలా ప్రభాకర్‌ పాల్గొన్నారు.