విజయవాడ, 07-06-2018: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, జ్యోతిర్మయి తెలుగు గజల్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 10, 11 తేదీల్లో గజల్‌ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టరు డి.విజయభాస్కర్‌ తెలిపారు. సత్యనారా యణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలోని తన కార్యాలయంలో బుధవారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. కళాదర్శిని (లయోలా) ఆడిటోరియంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో ప్రముఖ గజల్‌ సాహితీవేత్త రెంటాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో గజల్‌ చందస్సుపై తొలి సదస్సు జరుగుతుం దన్నారు. 

హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ వహీద్‌ పర్యవేక్షణలో ఉర్దూ గజల్‌ పరిచయం రెండో సదస్సుగా, రామకృష్ణ పర్యవేక్షణలో గజల్‌ గాన యోగ్యత చమత్కారం అనే సదస్సు ఎండ్లూరి సుధాకర్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తామని తెలిపారు. నవీన తెలుగు గజల్‌ సాహిత్యంపై మరో సదస్సు హైదరాబాద్‌కి చెందిన పత్తిపాప మోహన్‌ పర్యవేక్షణలో తెలుగు గజల్‌ గాన చరిత్ర జరుగుతాయని చెప్పారు. వీటితోపాటు 5 గజల్‌ గ్రంథాల సమీక్ష దాని తర్వాత 12 మంది గజల్‌ కళాకారులతో గజల్‌ ముషాయిరా ప్రత్యేక సదస్సు జరుగుతుందని, దేశవ్యాప్తంగా 40 మంది గజల్‌ కళాకారుల ఆడియో స్ర్కిప్టు పరీక్షించి 12 మందిని ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. గజల్‌ పోటీలో పాల్గొననున్న 50 మందికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు సదస్సులు జరుగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గజల్‌ రచయితల నుంచి 50 గజల్‌ రచనలను తీసుకొని పుస్తకం (సంకలనం) రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ రచన చేసిన 50 మంది రచయితలకు సత్కార కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. వేడుకల కరపత్రాన్ని విజయభాస్కర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో ఎం.జ్యోతిర్మయి, ఎం.ప్రభాకర్‌ పాల్గొన్నారు.