నల్లకుంట, హైదరాబాద్, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరళీకరణ విధానాలు అమలవుతున్న నేపథ్యంలో దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిశ్రమలు మూతపడుతున్నాయని, దీంతో విద్యార్థులు, మేధావులు, అధికారులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ‘లెస్సన్స్‌ లెర్ట్న్‌’ అనే పుస్తకాన్ని వెలువరిస్తున్నట్లు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్‌ సీఎండీ ఎం.పి.ఈశ్వర్‌ రచించిన ‘లెస్సన్స్‌ లెర్ట్న్‌’ (ది స్టోరీ ఆఫ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్‌) పుస్తకావిష్కరణ ఈ నెల 18వ తేదీన బేగంపేటలోని వివంతా తాజ్‌ హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ డైరెక్టర్‌ ఆర్‌.కె.మిశ్రా, ఎం.పి.ఈశ్వర్‌, ఎ.కె.శ్రీనింగ్‌, అరవింద్‌ ఆగర్వాల్‌, కిరణ్మయి తదితరులు మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడుతున్న పరిశ్రమలను అభివృద్ధిపథంలో తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పుస్తకం రాశారన్నారు.ఈ పుస్తకావిష్కరణ సభకు ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.కె.జోషి, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు తదితరులు హాజరవుతారని వారు తెలిపారు.