నెల్లూరు (సాంస్కృతికం), ఫిబ్రవరి 7: సుప్రసిద్ధ కవి డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు స్మారక 9వ నాగభైరవ పురస్కారం- 2017ను.. ప్రఖ్యాత సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అందచేయనున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చిన్ని నారాయణరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నెల్లూరు నగర పురమందిరంలో జరిగే నాగభైరవ అవార్డుల పండుగలో సిరివెన్నెలకు రూ.25వేలు నగదుతో సత్కరిస్తున్నట్లు చెప్పారు.నాగభైరవ సినీ, సాహిత్యం, ఉపాధ్యాయ, వచన కవిత్వంలో విశేష కృషి చేసినందున అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికీ పురస్కారాలు అందజేస్తున్నట్లు వివరించారు. నాగభైరవ ఉపాధ్యాయ అవార్డును సర్వోదయ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌, చారిత్రక పరిశోధకులు డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తంకు అందచేయనున్నట్టు తెలిపారు. అలాగే కవిత్వపరంగా వచన సంపుటాల పోటీలో విజేతలైన డాక్టర్‌ కోగంటి విజయ్‌, గుంటూరుకు డాక్టర్‌ విజయ్‌కి కవితా పురస్కారం అందచేస్తున్నట్టు పేర్కొన్నారు. వంజవాక సతీ్‌షరెడ్డి, కొండెపోగు బీ డేవిడ్‌ లివింగ్‌ స్టన్‌, లక్ష్మణరావు, కాట్రగడ్డ లక్ష్మీ నరసింహరావు, ఆవాల శారదలకు నాగభైరవ స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు చెప్పారు.