విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మకత, సంస్కృతీ సమితి, పర్యాటక శాఖ, దేవదాయ, ధర్మదాయ శాఖ, దివి ఐతిహాసిక మండలిల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం, తెలుగు భాషా బ్రహ్మోత్సవాల పేరిట సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీకాకుళంలోని ఆంధ్రమహావిష్ణు దేవాలయ ప్రాంగణం ఈ రెండు విశిష్ట కార్యక్రమాలకు వేదిక కానున్నది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో డాక్టర్‌ ఎం.పద్మ, సృజనాత్మకత, సంస్కృతీ సమితి సీఈవో డాక్టర్‌ దీర్ఘాసి విజయభాస్కర్‌, చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల సహాయ కమిషనర్‌ ఎం.శారదాకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచంద్‌ తెలిపారు.

రెండురోజుల కార్యక్రమాల్లో భాగంగా తెలుగుభాషా బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించనున్నట్టు పూర్ణచంద్‌ తెలిపారు. తెలుగును పరిరక్షించుకునేందుకు, తెలుగు భాషా వికాసానికి అవసరమైన భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేందుకు ఈ కార్యక్రమాలలో శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. రెండు రోజుల కార్యక్రమాల్లో పాల్గొనేవారు 9866794024కు ఫోన్‌ చేసి, తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా ఏపీ డైరెక్టర్‌ కల్చర్‌ జి మెయిల్‌లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రతినిధి రుసుం చెల్లించనవసరం లేదు. ప్రాచీన భాషగా ఉన్న తెలుగును ప్రపంచభాషగా చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు.