పొద్దున్నే ఓ పద్యం నన్ను నిద్రలేపింది.
చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ
ఈ వేకువ నన్ను సూర్యుణ్ణి చేసింది.
ఇంతకాలం గుక్కపట్టి ఏడుస్తున్న
నా గుండె ఇప్పుడు కాస్త నిమ్మళించింది.
తాను మేల్కొని పక్కలో నిద్రపోతున్న
తల్లిని తదేకంగా చూస్తూ
లేత మునివేళ్ళతో ఆమె ముఖాన్ని
ముద్దాడుతున్న పసిబిడ్డలా
పొద్దున్నే ఓ పద్యం నన్ను నిద్రలేపింది.
 
కలం నిండా మెలకువ నింపుకుని
రారమ్మని ఎంత అనునయించినా
గూట్లోనే కిచకిచలుపోతూ
ఎంతకూ బయటకు రాని బుల్లిపిట్టలా
రాత్రంతా బెట్టుచేసిన పద్యం
ఈరోజిలా తెల్లవారకముందే నన్ను తట్టిలేపింది.
 
ఏ నడిరాత్రి దాటాక నిద్రలోకి జారుకున్నానో
రెప్పలు తెరిచి నాగుండెమీద పడివున్న పుస్తకంలా
రాత్రంతా నా ఆలోచనలు జాగారం చేస్తూనేవున్నాయి.
గదిలోని దీపం కింద నీడలా నాలోనే ఉంటూ
నాకు అందకుండా హొయలుపోయిన పద్యం...
చెరువులోంచి పైకి లేచీలేవనట్లు ఎగిరే చేపలా
పట్టుబడకుండా నాలో గిరికీలు కొడుతున్న పద్యం...
పొద్దున్నే నన్ను నిద్రలేపింది.
 
నేలపొరలకింద ధ్యానావస్థలో ఉండి
ఒక్క చినుకుతో కన్నుతెరిచి పిడికిలెత్తిన విత్తులా
ఏ గాఢసుషుప్తిలోనో
నాలోని ఏ పురాస్మృత మేఘాల కదలికతోనో
వాక్యవృష్టి కురిసి
ఎప్పుడు ఒళ్ళు విరుచుకుని లేచిందో గానీ
పొద్దున్నే ఓ పద్యం నన్ను నిద్రలేపింది.

పక్కి రవీంద్రనాథ్‌
94403 64486