తెలంగాణ ‘అస్తిత్వ’ కేతనం

ఆంగ్ల, భారతీయ భాషల కథలు తెలుగులోకి చాలా అనువాదమయ్యాయి. కానీ, తెలంగాణ కథలు ఆంగ్లం, హిందీలోకి తర్జుమా కావడం చాలా తక్కువ. ఎంపిక చేసిన 35 కథలను ఆ రెండు భాషలలోకి అనువాదం చేయించి ప్రచురించడంతో పాటు మూల కథల్ని కూడా అందు బాటులోకి తీసుకురావడం ముదావహం. 20వ శతాబ్దంలోతెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన మార్పులతో పాటు తెలంగాణ నడిచి వచ్చిన దారుల్ని తెలుగేతర భాషల పాఠకులు అర్థం చేసుకోవడానికి ఇదొక ఆధార గ్రంథంగా నిలుస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి నుంచి షాజహానా దాకా మూడు తరాలకు చెందిన కథకుల రచనలున్నాయి ఇందులో. కె. శ్రీనివాస్‌ రాసిన ‘కథల దోసిలి’ ముందుమాట ఆలోచనాత్మకం. సంపాదకుల కృషి అభినందనీయం. వస్తువు, శిల్పం, భాష మీద ప్రత్యేక దృష్టి ఉన్నవారితో పాటు తెలంగాణ కథ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనుకునేవారు చదివి దాచుకోదగ్గ గ్రంథం.

- డా. వెల్దండి శ్రీధర్‌

అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు) 

ప్రధాన సంపాదకులు: డా. నందిని సిధారెడ్డి

పేజీలు: 440, వెల: రూ. 250

ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి, హైదరాబాద్‌.