ఈ కాలానికి అవసరమైన కళా సంవాదం

జి. లక్ష్మీనరసయ్య పేరు ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ ఈ తరం కవులు, రచయితలు నిర్మాణ, దృక్పథ విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయన వద్ద ఒక మేరకైనా సమాధానాలు దొరుకుతాయి. కొందరికి గట్టి కాలంగా, మరికొందరికి గడ్డు కాలంగా కనిపించిన 1990ల్లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలను ‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’, ‘సామాజికి కళా విమర్శ’ పేరిట రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఆనాడు ఆయన ఏ వాదాలపై దండెత్తాడు, ఏ ధోరణులను స్వాగతించాడనేది పక్కన పెడితే, తెలుగు సాహిత్యంలో విమర్శనా రంగం గుంటపూలు పూస్తున్న కాలమిది. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లకయినా లక్ష్మీనరసయ్య వ్యాసంగం వెలుగుచూడటం కళా, కవిత్వ విమర్శకు సంబంధించిన చర్చకు కొత్త కోణాలను అందిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. వస్తు, శిల్ప, శైలుల గురించి లక్ష్మినరసయ్యకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కవిత్వం ధ్వని ప్రధానమూ, భాషా ప్రధానమూ. వీటిని కవి ఎలా సాధిస్తాడనేదే అతని శైలిని నిర్ణయిస్తుంది. పొడవాటి వాక్యాలను ముక్కలుగా పేర్చడంతోనే కవితారూపం రాదని, రూపం మనం తెచ్చి అలంకరించేది కాదని.. వస్తువు తన రూపాన్ని తానే ఎంచుకొంటుందన్న ఆయన విశ్లేషణ పరిశీలించదగ్గది. ఒక్కోసారి శుద్ధ వచనమూ అద్భుతమైన కవిత్వమైన వైనాన్ని ‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’లో చూడవచ్చు. వస్తు- శిల్పాల పేచీని, వచన- కవనాల తగువుని తీర్చిన ఈ పుస్తకం ఒక రకంగా వర్క్‌షాప్‌ గైడ్‌!