ఆధునిక మానవుని ఆత్మ సంఘర్షణ

కాఫ్కా .. ఆధునిక సాహిత్యానికి సరికొత్త అధ్యాయాన్ని అందించిన నిగూఢ కళాత్మక తాత్వికుడు. ఆయన రాసిన ‘మెటమార్ఫసిస్‌’ వర్తమాన ప్రపంచాన్ని రూపాత్మక కలలభాషతో కలవరపెట్టింది. అతని రచనలలో కొన్నింటిని ‘ఫ్రాంజ్‌ కాఫ్కా మెటమార్ఫసిస్‌’ పేరుతో తెలుగువారికి అందించే ప్రయత్నాన్ని చేశాడు మెహెర్‌. ఇంగ్లిష్‌ అనువాదాలపై ఆధారపడ్డానని చెప్పినా కాఫ్కా అంతస్సారాన్ని వీటిలో పూర్తిగా నింపాడు. ‘చైనా గోడ’ (గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా)లో ప్రతి సన్నివేశం వెనక అధికారం, స్వేచ్ఛ, సత్యం, దేవుడు, సంప్రదాయాలకు మధ్య నలిగే మనిషి అంతర్మఽథన ప్రతిమలు మనల్ని ప్రశ్నిస్తాయి. ‘పల్లెటూరి వైద్యుడు’ (ఎ కంట్రీ డాక్టర్‌) మ్యాజిక్‌ రియలిజం టెక్నిక్‌లో మోసపోయిన డాక్టర్‌ను, నిస్సహాయత నిర్దయగా బందీ చేస్తుంది. ‘తీర్పు’ (ద జడ్జిమెంట్‌) అంతర్లోకాలను వదిలేసిన మనిషికి, బహిర్‌ ప్రవర్తన శిక్ష విధిస్తుంది. ‘రాబందు’ (ద వల్చర్‌) పరిపూర్ణమైన విడుదలను కోరుతుంది. ‘చట్టం ముందు’ (ద ట్రయల్‌) చట్టం, సృష్టికర్తకు.. సామాన్యుడికి మధ్యనున్న అగాఽథాల అడ్డంకుల్ని వేలెత్తి చూపిస్తుంది. ‘మెటమార్ఫసిస్‌’లో కీటకంగా మారిన గ్రెగర్‌ పాత్ర ద్వారా, వర్తమాన జీవితాల్లోని ఇబ్బందులు స్వప్నాకృతులుగా స్వేచ్ఛను కోరుకుంటాయి. వాస్తవికత సంకెళ్లు తెంపి పాఠకుల మనోగదుల తాళాలు పగులగొడతాయి. మెహెర్‌ అనువాదం కళ్లను, మనసును వాక్యాల వెంట ఆలోచనాత్మకంగా పరుగులు పెట్టిస్తుంది.

 

- ఎ. రవీంద్రబాబు

ఫ్రాంజ్‌ కాఫ్కా (‘మెటమార్ఫసిస్‌’ ఇంకొన్ని) కథలు

అనువాదం: మెహెర్‌,

పేజీలు: 126,

వెల: రూ. 100

ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్‌ : 98661 15655