సమాజ సజీవ చిత్రణ

దిగంబర కవిత్వోద్యమం నుంచి విప్లవ వీచికల మీదుగా అస్తిత్వ ఉద్యమాల వరకూ అప్రతిహతంగా తన రచనా వ్యాసంగాన్ని సాగిస్తున్నారు నిఖిలేశ్వర్‌. కవిగా తనదైన ముద్రను పాఠకుల హృదయాలపై చెక్కిన నిఖిలేశ్వర్‌ 1961 నుంచే కథా ప్రక్రియలోనూ సొంతగొంతుక వినిపిస్తున్నారు. తను రాసిన 40 కథల్లోంచి 22 ‘నిఖిలేశ్వర్‌ కథల’ పేరుతో వచ్చాయి. ‘కొండకింద భూమి’, ‘సూర్యుడు’ కథలు విప్లవపోరాటానికి సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే, ‘ఆరని మంటలు’, ‘మనిషి - మట్టి’ కథలు యుద్ధ్థనేపథ్యంలో మానవీయతను కళ్లకు కడతాయి. ‘నల్లులు’, ‘జాలి’, ‘బాయి ఆగమైపోయింది’, ‘గడ్డం మనిషి’, ‘వసంతం ఇల్లెక్కడ?’ కథలు మధ్యతరగతి మానవ, ఆర్థిక సంబంధాల్లోని క్లిష్టతను, పరిణతతో విశ్లేషిస్తాయి. సర్వసాక్షి, ఉత్తమ పురుష దృష్టికోణాల్లో సాగే ఈ కథల్లో ‘ఆకారాల నీడలే తప్ప విశ్వాసాల చప్పుడే తప్ప ఎవరికీ ప్రాణాలు లేనంతగా నిశ్శబ్దం’, ‘ఆకాశంలో సగం చంద్రుడు, సగం వంగిన చాకులా నిలబడ్డాడు’ లాంటి వాక్యాలు మనల్ని ద్రవీభవింపజేస్తాయి.

 

ఎ. రవీంద్రబాబు
నిఖిలేశ్వర్‌ కథలు
పేజీలు: 148, వెల: రూ. 110
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌