ఔషధ గ్రంథం

‘రైతు నేస్తం’ ఇప్పటికే పలు పుస్తకాలతో ప్రజల్లో ఆరోగ్యంపట్ల అవగాహన ఏర్పరచింది. ఆ క్రమంలో వచ్చిందే ఈ ‘ఔషధ వేదం’. లక్షలాది రకాల్లోంచి 215 మొక్కల్ని ఎంపిక చేసుకుని, వాడుక/శాస్త్రీయ పేర్ల వివరాలతో పాటు వాటికి ఆయుర్వేదంలో, వ్యవసాయరంగంలో వున్న ప్రాముఖ్యతని కూలంకషంగా తెలిపే ప్రయత్నం చేశారు. ఇంట్లో పూజలందుకునే తులసి నుండిపెరటిలోని గన్నేరు, చామంతి.. వంటల్లోని పసుపు, ఉల్లి, పుదీన, అల్లం, ఇంగువ, మిరియాలు.. తలంటుకునే శీకాయ మీదుగా వీధిలోని నల్లతుమ్మ, వెలగ.. పొలంలోని గోరింటాకు, తంగేడు, గురివింద, ఉత్తరేణి వరకు దాదాపు మనమెరిగినవే. ఏ జబ్బుకి ఏ మొక్క ఏ మేరకు పనిచేస్తుందనే వివరాలన్నీ గుదిగుచ్చి చక్కటి ఫోటోలతో నాణ్యమైన ముద్రణతో మనకందించిందీ నేస్తం. ఇంటింటా విధిగా ఉండాల్సిన ఔషధ గ్రంథం ఇది.

- తహిరో

ఔషధ వేదం (వ్యవసాయ,ఆరోగ్యంలో ఔషధ మొక్కలు)

రచన: డా.కొసరాజు చంద్రశేఖరరావు

పేజీలు: 346,

వెల: రూ. 350

ప్రతులకు: రైతునేస్తం 040 - 2339 5979