స్త్రీ జీవితపు నూతన దృష్టికోణాలు

తెలుగు కథా రచనలో కల్లూరి శ్యామల ముద్ర విభిన్నం. ప్రాపంచిక అంశాలలోని ప్రతి స్పందనలను వస్తువులుగా స్వీకరించి జీవితానుభవ సారాన్ని ఆవిష్కరించడంలో గొప్ప శైలిని, శిల్పాన్ని ప్రదర్శిస్తూ పాఠకుడిని ఆకట్టుకుంటారు. ఆమె తాజా రచన ‘కంచికి వెళ్ళకూడని కథలు’ టైటిల్‌ నుంచి లోతైన తాత్త్విక దర్శనమే! 12 కథల ఈ సంకలనంలో వృద్ధాప్యపు జీవన ఛాయలతో పాటు వైవిధ్యంగా చిత్రీకరించినవి కొన్నయితే ప్రేమకథా గమనంలోని భావోద్వేగాలను ఊహించని రీతిలో నడిపినవి మరికొన్ని. మనోవిశ్లేషణతో రాసినవి ఇంకొన్ని! ఇతివృత్తం, పాత్ర చిత్రణ, సంభాషణా శిల్పం - ముగింపు వేటికవే చాలా భిన్నం! సామాజిక, ఆర్థిక, మానవీయ, స్త్రీ సంబంధ జీవన విశేషాలలోని విభిన్న అంశాల నూతన దృష్టి కోణాలివి!

- వల్లూరి రాఘవరావు

కంచికి వెళ్ళకూడని కథలు, రచన : కల్లూరి శ్యామల

పేజీలు: 128, వెల: రూ. 100, 

ప్రతులకు: నవచేతనా పబ్లిషింగ్‌ హౌస్‌