అష్టవిధ నాయికల విన్యాసం

భరతముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొన్న ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించిన పదప్రయోగం అష్టవిధ నాయికలు. భారతీయ చిత్రకళల్లో, సాహిత్యంలో, శిల్పకళలలో, శాస్త్రీయ నృత్యాల్లో వీరిని ప్రామాణికంగా పేర్కొనడంతోపాటు, వారి హావభావాలను ఆయా కళల్లో బహిర్గతంగా, పారదర్శకంగా తెలియచేశారు. ముఖ్యంగా మధ్యయుగపు కళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. జయదేవుడి గీతాగోవిందంలోనూ, వైష్టవ కవి వనమాలి రచనల్లోనూ రాధ పాత్రని నాయికగా, శ్రీకృష్ణుడిని నాయకుడిగా ప్రముఖంగా కీర్తించారు. ‘స్వాధీన పతిక’, ‘వాసక సజ్జిక’, ‘విరహోత్కంఠిత’, ‘విప్రలబ్ధ’, ‘ఖండిత’, ‘కలహంతరిత’, ‘ప్రోషిత భర్తృక’, ‘అభిసారిక’ - ఈ అష్టనాయికలను కూచిపూడి నాట్యంలో పరిచయం చేయడం మనకు తెలిసిందే. రంగస్థలంపై యామినీ కృష్ణమూర్తి, శోభానాయుడు వంటి నృత్య కళాకారిణిలు ఈ నాయికలకు ప్రాణం పోసిన సంగతి మనకు తెలిసిందే! కేవలం కావ్యనాయికలుగానే మిగిలిపోకుండా, వివిధ ప్రక్రియల ద్వారా సామాన్యుడి రసజ్ఞతకు సైతం అందేలా తీర్చిదిద్ది, ముఖ్యంగా బాపు ప్రతిరూపాలకు ప్రాణం పోసి పుస్తకంగా తీసుకురావడం ముదావహం. కష్టవిధ నాయికలను మాత్రమే మిగిల్చుకున్న ఈ తరానికి ఈ అష్టవిధ నాయికల స్వరూప స్వభావ చిత్రణా పద్యాలు ఒక బహుమానం. 

 

 - వల్లూరి రాఘవరావు


అష్టవిధ నాయికలు
సంపాదకుడు : టేకుమళ్ళ వెంకటప్పయ్య
పేజీలు : 224, వెల : రూ.150
ప్రతులకు: 80963 10140