డా.వి.చంద్రశేఖరరావు కథలకు ‘ముగింపు’ లేదు..

తన లోపలి గాయాల్ని, కలల్ని, నిశ్శబ్దాల్ని బద్దలుకొట్టి రచనలుగా అందించిన సృజనకారుడు డా.వి.చంద్రశేఖరరావు. వర్తమానాన్ని సామాజికతాత్వికతతో, సొంత డిక్షన్‌తో రికార్డు చేసిన కలం ఆయనది. 2012 - 17 మధ్యలో ఆయన రాసిన ఏడు కథల్ని వారి కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు ‘ముగింపుకు ముందు’ పేరుతో ముద్రించారు. ఈ కథల్లో పాత్రలూ, వాటి భావజాలం ఉంటుంది. గతానికి, వర్తమానానికి తెగుతున్న లంకెల మధ్య తీవ్రమైన ఘర్షణ ఉంటుంది. ఇవి 1980ల తర్వాతి కాలంలోని సాహిత్య, సామాజిక సిద్థాంతాల విస్ఫోటనకు నికార్సైన రికార్డులు. ‘పూర్ణమాణిక్యం ప్రేమకథలు’లో విప్లవ, దళిత, స్త్రీ వాదాల చూపు ప్రవహిస్తుంది. ‘హిట్లర్‌ జ్ఞాపకాలు’ యూనివర్శిటీ ఉద్యమాల్లోని అరాచకాల్ని, కుల లింగ వివక్షను గ్రాఫిటీలా చిత్రిస్తుంది. ‘సూర్యుని నలుపురంగు రెక్కలు’ నల్లసూరీడి జీవన ప్రయాణాన్ని శకలాలుగా వర్ణిస్తుంది. ‘కొయ్యగుర్రాలు’లో పాత్రలు జ్ఞాపకాల నీడల్ని వెంటేసుకుని తిరుగుతూ ఉంటాయి. ‘బ్లాక్‌ స్పైరల్‌ నోట్‌ బుక్‌’ అంటరాని దుఃఖంలోంచి కురిసిన హింసను భరించలేక రోదిస్తుంది. ‘నేనూ, పి.వి.శివం’ వ్యాపార ప్రపంచంపై ఉమ్మేస్తుంది. ‘ముగింపుకు ముందు’ ఒంటరి తనాన్ని, బంధాల్లోని అస్తిత్వాల ఆలోచనను తర్కిస్తుంది. ప్రతీకలు, మెటాఫర్‌లు, పారడాక్స్‌లు ఈ కథల్లో రంగుల్లా కదలాడుతుంటాయి. పాత్రలు చట్రాన్ని బద్దలు కొడుతూ స్వీయచేతనలోకి జారిపోతుంటాయి. చంద్రశేఖరరావు అనిశ్చితిలోంచి వచ్చిన వ్యక్తావ్యక్తాలివి. అందుకే ఇవి ముగియని కథలు.                                                                                                            

- ఎ. రవీంద్రబాబు

ముగింపుకు ముందు (కథలు)

రచన: డా. వి. చంద్రశేఖరరావు, పేజీలు: 132, వెల: రూ.100 

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు, e book: www.kinige.com