మనిషితత్వాన్ని పట్టుకునే ప్రయత్నం  

అక్షరాన్నే పరిచయ వేదికగా మార్చుకున్న రచయిత్రి చంద్రలత. వర్తమానానికి, గతానికి ఉన్న తేడాను మానవీయకోణం నుంచి చిత్రిస్తున్న సునిశిత కలం వారిది. వివిధ పత్రికల్లో వచ్చిన 19 కథలను ‘పిల్లలు మాయమైన వేళ’ పేరుతో ముద్రించారు. ఈ కథలలో బాల్యాన్ని బందీ చేసి, పిల్లల కలల్ని కల్లలు చేస్తున్న సమాజ పోకడలను ప్రశ్నించారు. భార్యలపై పెత్తనం చెలాయిస్తున్న భర్తల సాంస్కృతిక అధికార దాహంపై, జెండర్‌ డిస్ర్కిమినేషన్‌పై యుద్ధం ప్రకటించారు. పుట్టుకతోనే అమ్మాయి, అబ్బాయి అనే స్పృహతో పిల్లలను ఎలా వేరుచేస్తున్నారో చెప్తుంది ‘ఆరంభం’ కథ. పిల్లల రెక్కలను పెద్దలు వాళ్ల ఆశలు, ఆశయాలతో ఎలా నరికేస్తున్నారో వివరిస్తుంది ‘అనగా అనగా’. నేటితరం చిన్నారులు కోల్పోతున్న ఆనాటి ఆటలు, పాటలు, కథల్ని గమ్మత్తుగా వర్ణిస్తూ, మనసును ద్రవింపజేస్తుంది ‘పిల్లలు మాయమైన వేళ’. ఇలా ప్రతి కథలో మాయమవుతున్న మనిషితత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు చంద్రలత. ‘నా నవ్వు నా ఏడుపు నా చేతుల్లో లేవు’, ‘బంగారం విలువ తెలిసినంతగా బాల్యం విలువ తెలియకపోవడం ఎంత విషాదం’, ‘పనికి వచ్చే వరకే వేటినైనా ప్రేమిస్తారు..’ కథల్లో కనిపించే ఇలాంటి వాక్యాలు మనసుని మెలిపెడతాయి. శిల్పసౌందర్యంతో నిండిన ఈ కథలు పాఠాలే కాదు గుణపాఠాలు కూడా.

 

- భవ్యశ్రీ

పిల్లలు మాయమైన వేళ (కథలు),

రచన: చంద్రలత

పేజీలు: 191, వెల: రూ.195, 

ప్రతులకు: 0861- 2337573, పుస్తక కేంద్రాలు