రచయిత ఇండ్ల చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఒక రచయితగా సృజనాత్మకతని పెంచుకోవడానికి కాల్పనిక కథలు రాస్తాను. దళిత గ్రామీణ నేపథ్యంతో స్థానిక బాషలో రాసే కథల్లో నా ఉనికిని, నా జాతిని, వాళ్ళ అమాయకపు స్వచ్ఛమైన జీవితాల్లో నిజాయితీని రాస్తాను.
 
ఈమధ్య విడుదలైన మీ కథాసంపుటి ‘రంగుల చీకటి’ లోని కథల్లో కామన్‌గా, అంతర్గతంగా కనిపించే థీమ్‌ ఏమన్నా ఉందా?
ఒకే పుస్తకం అయినప్పటికి అన్ని కథల్నీ కలిపి థీమ్‌ ఎక్కడా ఉండదనుకుంటా. దీన్లో ఆరు కాల్పనిక కథలు, ఆరు దళిత గ్రామీణ నేపథ్యంతో స్థానిక బాషలో రాసిన కథలు వున్నాయి. కాల్పనిక కథల్లో నా సృజనాత్మకతనీ, మిగతా ఆరు కథల్లో గ్రామీణ దళితుల నిజ జీవితాలని చూడవచ్చు.
 
 
కాల్పనిక కథలు, దళిత గ్రామీణ నేపథ్యంతో రాసిన కథలు... ఈ వైవిధ్యం ఎలా వచ్చింది?
నేను కథలు రాయడం సాధన చేసింది కాల్పనిక కథల తోటే కాని పత్రికలో మొదటిగా అచ్చ య్యింది మాత్రం స్థానిక బాషలో రాసిన కథే. ఒక రచయితగా సృజనాత్మకత పెంచుకోవడానికి కాల్పనిక కథలు రాస్తాను. దళిత గ్రామీణ నేపథ్యంతో స్థానిక బాషలో రాసే కథల్లో నా ఉనికిని, నా జాతిని, వాళ్ళ అమాయకపు స్వచ్ఛమైన జీవి తాల్లో నిజాయితీని రాస్తాను. కానీ స్థానిక భాషలో రాసే కథలనుంచి బయటకు రావడం అంత సులభం కాదు. ఆ కథ నా జీవితంలో భాగం కాబట్టి, ఆ బాధల తాలూకు బాధలోంచి బయటకు రావడానికి కూడా ఈ కాల్పనిక కథలు నాకు సహకరిస్తాయి. కాని రెండు రచనల్లో కూడా మానవ సంబంధాలు నిజాయితీగా కథల్లో ఒదిగిపోతాయి.
 
‘సుభాషిణి కాదు సుమలత’, ‘పచ్చాకు సీజన్‌’ వంటి కథల్లో దళిత సమస్య కంటే దళిత జీవిత చిత్రణే ప్రధానంగా కనిపిస్తుంది...
దళిత సమస్యలు రాసే రచయితలు చాలమంది వున్నారు. ఇక్కడ చదువుకున్న దళితుల జీవితాలు లేదా పట్టణాల్లో దళితుల జీవితాలను మాత్రమే ఎక్కువగా కథల్లో చూస్తు న్నాం. అదే నిజమని నమ్మి ‘‘వాళ్ళకేమి?’’ బాగానే ఉన్నారుగా అని పెదవి విరుస్తున్నాం. కాని నిజానికి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న దళితుల జీవితం మనం ఊహించ లేనంత వెనకబడి వుంది. మనం కథల్లో చదువుతున్న దానికి చాల భిన్నంగా వుంటుంది. నా కథల్లో దళిత జీవిత చిత్రణ దళితులని మరో కోణంలో చూపిస్తుంది. ఆ జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి నా కథలు సహకరిస్తాయి.
 
నాటక రంగంలో పనిచేస్తున్నారు. మీ రచనల మీద నాటక ప్రభావం గురించి చెప్పండి?
కథని నాటకంగా మలచడం నేను చాలా సార్లు చేసాను. అందుకే నాటకానికి కథ బలం అని నమ్ముతాను. నేను నాటకం చేస్తున్నప్పుడు ఆడియన్స్‌కి ఏ సన్నివేశం నచ్చు తుందో, ఎలా వుంటే నచ్చుతుందో ముందుగానే ఊహించు కుంటూ దర్శకత్వం చేస్తాను. అది అలవాటుగా మారింది. అదే టెక్నిక్‌ కథ రాస్తున్నప్పుడు కూడా ఫాలో అవుతాను. అందుకే నా కథలు చదువుతున్నప్పుడు అక్కడ ఆ ప్రజల మధ్య వున్నట్టు, వాళ్ళ మాటలు వింటున్నట్టు ఉంటుందని నాకు చాలామంది చెప్పారు. ఇక్కడ సందర్భం కాకపోయినా మన తెలుగు సాహిత్యంలోని గొప్ప కథలను నాటకాలుగా మారిస్తే గొప్ప నాటకాలు వస్తాయని నా నమ్మకం.
 
ఇండ్ల చంద్రశేఖర్‌ (పలకరింపు)
 99124 16123