ఎక్కడా ఎవరూ లేరు

మీ భూముల్లో నిప్పు రవ్వలు ఎవరు నాటారు?
అమాయక హృదయాలలో ఈ అగ్నిని ఎవరు రగిలించారు?
నతమస్తకులై ప్రార్థించే ప్రార్థనలకు
ఏమాత్రం ఫలితం లేనట్టు
సంవత్సరంలో పన్నెండు నెలలూ
నిర్జీవమైన ఋతువే కొనసాగుతోంది
ఎవరో తోటమాలిగా ఉండి తోటలను తగలబెట్టారు
ఎవరో ఛత్రఛాయగా నిలిచి వసంతాలను కొల్లగొట్టారు
నిషాత్‌, ఛష్మాషాహి, దాల్‌, ఉల్లర్‌, షాలిమార్‌
తోటలన్నిటిలో ఆకురాలు కాలమే కొనసాగుతోంది
నీ నీటి ఊటల, కొండల, వాగుల, జలపాతాల
శాంతి సంపదలకు కొండచిలువలు కాపలా కాస్తున్నాయి
అందరూ నీ భూమిపైనున్న ఆకాశాన్ని కోరుకుంటారు
నీ చెట్లవేళ్ళను క్రుళ్ళబెట్టి కొమ్మల్లో తమగూడు కట్టుకోవాలనుకుంటారు
నీ నీళ్ళలో మృత్యుకారకమైన విషాన్ని ఎవరు కలిపారు?
నీ తోటలన్నిటినీ శ్మశానాలుగా ఎవరు మార్చారు?
తియ్యగా పాడే బుల్‌బుల్‌ పిట్టను ఎవరు బెదరగొట్టారు?
ఇంద్ర ధనుస్సులుండే నీ ఆకాశంలో ఈ పొగ ఎందుకు క్రమ్ముకొంటోంది?
నీ గొప్పతనాన్ని ఎరిగిన రాజుల ప్రతి జ్ఞాపకమూ విలపిస్తోంది
వేల సంవత్సరాల నీ చరిత్ర సిగ్గుపడుతున్నట్టుంది
ఏదైనా న్యాయం చెయ్యటానికి దైవ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుందో!
పావన పురుషులైన నీ సూఫీలందరూ మౌనంగా ఎందుకున్నారో!
సూర్యునికి నీ మీద కోపమెందుకో!
వెన్నెలకు నీపై అలుక ఎందుకో!
నీ సరళత్వమే నీకు శత్రువయింది ఎందుకు?
నీ పక్షుల రోదనలో మళ్ళీ తియ్యటిపాట ఎవరు తెస్తారు?
నీ గాయపడిన పెదవులపై చిరునవ్వు ఎవరు వెలిగిస్తారు?
పాడుబడిన ఇండ్లలోకి శాంతిదూత జీవకళను ఎప్పుడు తెస్తుంది?
యువ మరణాల దుఃఖంతో ముడతలు పడ్డ ముఖాలలో
చిరునవ్వులు ఎప్పుడు పండిస్తుంది?
వృద్ధ కన్యల పాపిట్లలో ముత్యాలు ఎప్పుడు అలంకరిస్తుంది?
ఎక్కడా ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరు వస్తారు
కష్టసమయంలో నీతో స్నేహమెవరు చేస్తారు?
నా కశ్మీరు లోయా, నీ గాయాలపై లేపనం ఎవరు రాస్తారు?
 
ఉర్దూ మూలం  - తరన్నుమ్‌ రియాజ్‌
తెలుగు అనువాదం - జె. భాగ్యలక్ష్మి