అసమాన ఉన్మాదంతో

 తెగబలిసిన ఒకానొక కాలసర్పం

అనాదిగా నా అడుగుజాడలపై
పడగవిప్పి బుసలుకొడుతూనే ఉంది 
ఆకాశమంత అసహనంతో
నా ఉనికి మీద విచ్చలవిడిగా 
పచ్చివిషం కుమ్మరిస్తూనే ఉంది
నా కంచంలోబువ్వ మీద 
నేను నడిచే తొవ్వమీద
నిషేధాజ్ఞల్ని జారీ చేస్తుంది కాలసర్పం
ధిక్కరించే ఉక్కుపిడికిళ్ళను
ప్రశ్నించే సిరాచుక్కలను
పాశవికంగా సమాధి చేస్తుంది కాలసర్పం
విద్యా ఉద్యాన వనాల్లోకి చొరబడి
మూర్ఖత్వాన్ని పిచికారి చేస్తుంది
పాఠ్యపుస్తకాల్లోకి చొరబడి
తోకాడిస్తుంది కాలసర్పం
చరిత్రపుటలను నమిలి మింగేసి
అసత్యాలను విసర్జిస్తుంది
చిగురించే కొమ్మలపై
చీడపురుల్ని ఉసిగొల్పుతుంది
ఈ మట్టిలో మొలకెత్తిన
ఆకుపచ్చ నెలవంకలపై 
కారు చీకట్లను కుమ్మరిస్తుంది కాలసర్పం
నాకు నీడనిచ్చే
ఆదర్శ ప్రజాస్వామ్య సూత్రాలను చెరిపేసి
గుట్టుచప్పుడు కాకుండా
కుటిల గీతల్ని లిఖించాలని
కుట్ర చేస్తుంది కాలసర్పం
భరతమాత నుదిటిరాతను రాసిన
జ్ఞానమూర్తికి దండలు వేస్తూనే
ఆ మహనీయుని ఆశయస్ఫూర్తిని
అమాంతం ఉరితీస్తుంది కాలసర్పం
వైజ్ఞానిక సైనికులకు సమాధి కట్టి
దొంగ బాబాల పాదాలను నాకుతుంది.
బలేమంచి చౌకబేరమంటూ
జాతిసౌభాగ్యాన్ని ధారపోసి
కార్పోరేటు బేహారితో రమిస్తుందీ కాలసర్పం
పత్రహరితానికి పురుడు పోసిన
సూర్యకిరణాల్ని కూడా బహిష్కరించే
ఆధ్యాత్మిక అంధత్వంతో
తైతక్కలాడుతుంది కాలసర్పం
మూలాలను తెగనరుకుతూనే
ఫలాలను భక్షించాలని పరుగులు తీస్తుంది
జగమంతా విద్వేషాగ్ని రగిలించి
ఓటు ఫిడేలు వాయిస్తుంది కాలసర్పం
త్రివర్ణపతాకం ఊర్ధ్వ వర్ణంలో 
మనువు రాసిన వాక్యంలా 

మహా వంకర్లుపోతుంది కాలసర్పం

 

కోయి కోటేశ్వరరావు