‘‘తీవ్ర విషాదం, గొప్ప ఆనందం కలిగించే కథలు, లోపలి మలినరక్తాన్ని శుభ్రంచేసే ప్రాణవాయువులాంటివి.’’

 

‘కథ, కథకుని మనసులోని బరువుని దించుతూ, ఆ భారాన్ని సమాజంపైన పెట్టాలి. కథలోని ‘సమస్య’ సమాజంలో ఉన్నంతవరకూ కథ వర్తమానం. సమస్య తీరిపోతే అది చరిత్ర అవుతుంది..’.. అంటున్నారు రచయిత్రి ఎం ఎస్‌ కె. కృష్ణజ్యోతి. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
ఇటీవల విడుదలైన మీ కథాసంపుటి ‘కొత్త పండగ’లో మీ మనసుకు బాగా నచ్చిన కథ ఏమిటి? ఎందుకు?
ఒకటి కాదు, రెండు చెబుతాను. మొదటిది ‘సముద్రపు పిల్లాడు’. ఇది ఎందుకు నచ్చుతుంది అంటే, ఈ కథ చాలా మంది పాఠకులని ఏడ్పించింది. దీనిని చదవాలంటే, ముందు పాఠకులు పిల్లవాళ్ళు అయిపోవాలి. చెట్టుతో, చెరువుతో, సముద్రంతో మాట్లాడగలిగినంత చిన్నవాళ్ళు అవ్వాలి. అచ్చం సముద్రపు పిల్లాడిలాగా. రెండవది ‘తెల్ల మచ్చల నల్ల పంది’. ఇది అందర్నీ నవ్వించింది. నలుపు అనాగరికత! తెలుపు నాగరిక రంగు. నాగరిక తెల్లమచ్చలు అనువంశికంగా పొందిన నల్ల పంది, దాని ఆలోచన, జీవితం, ముగింపు, దీనినే ఒక కథగా రాశాను. తీవ్ర విషాదం, గొప్ప ఆనందం కలిగించే కథలు, లోపలి మలినరక్తాన్ని శుభ్రంచేసే ప్రాణవాయువులాంటివి.
 
ఈ కథాసంపుటిలో 2015-2018 మధ్య రాసిన పదిహేడు కథలున్నాయి. కథా రచన వైపు మీ తొలి అడుగులు, ప్రభావం గురించి చెప్పండి?
ఖదీర్‌ బాబు రాసిన ‘పోలేరమ్మ బండ కథలు’ నాకు ప్రేరణ. ‘కాకి గూడు’ పేరుతో మొదట ఒక కథ రాశాను. ఆ కథని చాలాకాలం ఏ పత్రికకూ పంపడానికి ధైర్యం చాలలేదు. పత్రికలో కథ అచ్చు కావాలంటే, అక్కడ మనకి తెలిసినవాళ్ళు ఎవరేనా ఉండాలి అనుకున్నాను. తరువాత ‘సవారీ’, ‘నేను నా దయ్యం’ కథలు రాసి రెండు పత్రికల చిరునామాలు సేకరించి ఏదైతే అదే అయ్యిందని పంపించే శాను. రెండూ ప్రచురణకు నోచుకున్నాయి. సిఫార్సులు అవసరం లేదు, మంచిగా కథ రాసి పోస్ట్‌ చేస్తే సంపాదకులు తప్పక వేస్తారు అని నమ్మకం వచ్చింది.
 
మొదట్లో మూడు నాలుగు కుటుంబ కథలు వ్రాశాను. సారంగ లాంటి వెబ్‌ మాగజిన్ల వల్ల నా దృక్పథంలో కొంత మార్పు కలిగింది. ఎంచుకునే ఇతివృత్తానికి కొంత ప్రయో జనం ఉండాలి అనిపించింది. కథ, కథకుని మనసులోని బరువుని దించుతూ, ఆ భారాన్ని సమాజం పైన పెట్టాలి. కథలోని ‘సమస్య’ సమాజంలో ఉన్నంతవరకూ కథ వర్తమానం. సమస్య తీరిపోతే అది చరిత్ర అవుతుంది. ప్రయోగాత్మకంగా ‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ కథ రాస్తే, అది చర్చనీయాంశం అయ్యింది. ఎగువ వర్గానికి చెందిన జగ్గయ్య పంతులి పేదరికం; చర్మకార వృత్తిలో ఉన్న మారయ్య లేమి, రాజకీయ భవిష్యత్తు గురించి ఆ కథ సూచ్యంగా మాట్లాడింది.
 
 ఈ మధ్యనే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎగువ సామాజిక వర్గాలకి కేంద్ర ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించింది. కానీ, అతి ప్రత్యేకమైన రెండో సంగతి, వ్యవహారంలో ‘దిగువ వర్గం’గా చెప్పబడుతున్న ప్రజానీ కానికి సమాన రాజకీయ అవకాశాలు ఎప్పటికి దక్కబోతు న్నాయి? అవి గనక దక్కితే ఆ కథతో ఇంక అవసరం లేదు. పిల్లలు ప్రధాన పాత్రలుగా ఉన్న షరీనా, డెవిల్‌ హౌస్‌, బొమ్మ కథలు కేవలం పెద్దలు చదవడానికి రాశాను. స్త్రీ సహజ అవసరాలను కూడా విలాసంగా అభివర్ణించిన దేశ ఆర్థిక విధానాన్ని నిరసిస్తూ ‘ఒక దేశం - ఒక దనమ్మ’ కథ రాశాను. ఎప్పుడైనా మంచి ప్రేమ కథలు, సంపన్నుల సమస్యల కథలు రాస్తే బాగుంటుంది అని చూస్తాను కానీ, కుదరడం లేదు!
 
కూతురిని కొట్టిన అల్లుడిని ఎలాగైనా కొట్టించాలనే పట్టపోళ్ళ లచ్చమ్మ కథ ‘దురాయి’. ఈ కథ వెనక ప్రేరణ ఏమిటో చెప్పండి?
నేపథ్యంగా పట్టపోళ్ళ సమాజాన్ని తీసుకున్నా, నిజానికి ఈ అంశం సార్వత్రికం. ప్రతి తరంలోనూ స్త్రీ శారీరక హింసకి లోను అవుతోంది. అనేకసార్లు స్త్రీలు తమ గౌరవం భంగం కావడాన్ని గ్రహించనుకూడా లేరు. కానీ, తమ తరువాతి తరాల ఆశక్తతని గమనిస్తారు. వేదన చెందుతారు. దానికోసం తమ పరిధిలో పోరాటం చేస్తారు. భర్త తనని కొట్టడం అతని హక్కుగా సంసారంలో స్త్రీ గుర్తిస్తుంది. కానీ, కూతుర్ని అల్లుడు కొడితే బాధ పడుతుంది. ఇలాంటి సందర్భాలని స్వయంగా చూసి, దానిని కథనం చేయాలనుకున్నాను. అందుకోసం, మనకి మామూలుగా పరిచయం ఉన్న సమాజాన్ని కాకుండా, భిన్నంగా ఉన్న సమూహాన్ని ఎన్నుకున్నాను. అక్కడి సంస్కృతి వేరు. చట్టం, అది అమలు అయ్యే విధానం కూడా వేరు. అయినా కూడా, స్త్రీ పరిస్థితి ఒకటే. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు నిరాదరణకు లోను అవుతున్నాయి. అనేకసార్లు ఉల్లంఘించబడుతున్నాయి. గాంధీజీ ప్రవచించిన ‘గ్రామ స్వరాజ్య’ రాజ్యాల్లో కూడా ఈ ఉల్లంఘన ఉంది అని చెప్పడానికి ఇది రాశాను. ఈ కథలో కొన్ని పట్టపు తెగకు చెందిన భాషా పద, వాక్య ప్రయోగాలు ఉన్నాయి. దేశం, భాష, సమాజం ఏది అయినా ఇప్పటికీ స్త్రీ ద్వితీయ శ్రేణిలోనే ఉంది. స్త్రీ పుటకే ఒక ‘దురాయి’.
 
ఎం ఎస్‌ కె. కృష్ణజ్యోతి
91107 28070