మనుషుల పక్కన నడుస్తుంటే

 

గులకరాళ్ళ మీదంగ
నీళ్ళు పారుతున్నట్టు ఉండాలిగాని
సీసీ కెమెరాల మధ్య నడుస్తున్నట్లు ఉంది.
ఏ మాట మాట్లాడితే
ఏ తప్పు తీస్తరో -
ఏ మనిషి పక్కన నిలబడితే
ఏ రంగు అంటగడుతరో -
లోపల భయంపొదల నడుమ
ఆత్మపిట్ట ఇరుక్కుంది.
 
పుట్టమీద
పసుపు కుంకుమ చల్లినట్లు ఉంటారుగానీ
పడగ విప్పకుండానేవిషం చిమ్ముతుంటరు.
గొంతు కోసిపోయినా బాగుండు గానీ
ష్యూరిటీ సంతకాలతో
పెదాలకొమ్మ మీది
నవ్వును కోసుకపోతుండ్రు
 
తమను తాము
ఆకాశమంత చూపించుకోవడానికి
వేరే వాళ్ళ ముందల
నన్ను గొర్రెనుచేసి బలివ్వడమే బాలేదు
మనిషిని చూస్తే
ఊరిని చూసినట్టో,
ఉత్తరాన్ని అందుకున్నట్టో  ఉండాలి గానీ
గూగుల్‌ పేలు, ఫోన్‌ పేలు గుర్తురావడాన్ని
ఏమందాము మిత్రమా?
 
ప్రేమను కూడా
కామెంట్లతోనే కొలిచే
ఈ మిషన్ల మధ్య బతకలేను
వేసుకున్న బట్టలు చూసి
స్నేహం చేసే
ఈ బొమ్మల మధ్య వేషం గట్టలేను
 
గుత్తులు గుత్తులుగా కాసిన
పండ్లచెట్టులాగ బతకాలనుకుంటాను
వేరుపురుగులాంటి  కొన్ని మాటలు
లోపలి నుంచి తొలిచేస్తుంటాయి
 
ఏ భయం లేకుండా
చెట్టూగుట్ట తిరిగొచ్చిన గాని
ఎందుకో ఇప్పుడు
మనిషిని చూస్తే భయమేస్తుంది.
 
తగుళ్ళ గోపాల్‌
95050 56316