ఆహారం కోసమో, ఆనందం కోసమో
దూర తీరాలకు ఎగిరిపోయిన పక్షికి
పొద్దు వాలిన తర్వాతే గూడు గుర్తుకొస్తుంది!
ఏ తుఫానులో చెట్టును వణికించినప్పుడే
ఎగిరిపోవాల్సిన అగమ్యగమ్యాలూ
గుర్తుకొస్తాయి!
 
అద్దానికీ గోడకూ అంతరం చెరిగిపోయినప్పుడే
అద్దం మీద పేరుకున్న ధూళిపొరలూ
గుర్తుకొస్తాయి!
 
అద్దంలో నీకు నీవే అపరిచితుడిలా
కనిపించినప్పుడే
 
నీ ముఖం మీది ముసుగులు దర్శనమిస్తాయి!
ముసుగులన్నీ తొలగించాక
కపోలాల మీది కన్నీటి మరకల కటకటాల్లో బందీ నీ ముఖబింబం!
ఇలాగే... ఇలాగే!
అద్దాన్ని బద్దలు చేయలేక!
కటకటాలను ఛేదించలేక!
 
నీటిగ్లాసులో రాలిన నూనె బొట్టులా
కొలనులోని చంద్రబింబంలా
తాను తానుగా మిగిలే యాతనలో
తనకు తనను మిగిల్చుకొనే తపనలో
చితికిపోతూ, చినిగిపోతూ,
విరిగిపోతూ, ఏకమవుతూ!
 
అవసరాల సూదులలో దూర్చిన
ఆత్మవంచన దారాలతో
మనఃశకలాలను కలిపి కుట్టుకుంటూ!
ఇలాగే... ఇలాగే! తెల్లారే దాకా... తెరజారేదాకా! 
పెన్నా శివరామకృష్ణ
94404 37200