కాళ్ల కింది నేలకు

పరాయి బతుకై వేలాడటం వారసత్వం.
కారణంలేకుండా జైలుగా ప్రకటించిన
సొంత గూటిలో
పావురం నుదుటి మీది
నల్ల ముద్ర పౌరసత్వం.
తిండి ఒక నెపం
కనపడని దేవుడొక ఆరోపణ
నింద వెంటాడే నీడ
 
మనసులో మాట
నెత్తుటి అనుభవం
మంచులోయలో
గుబులు గుబాళిస్తున్న టులిప్‌ తోటలు.
ఇంక ప్రార్థన కోసం ఏ దువా
రెప్పలు మూయదు
 
అవినీతికి అరవై చేతులు
ప్రతీకారాలు నూరుతున్న సందర్భంలో
చట్టం ప్రతి మాటేసినోడికీ చుట్టమే.
దొరికినోడు దొంగ
దొరకక ఉరికి నోడు
ఇమాన్‌దార్‌
ఖండాలు దాటో
గుడ్డిబండల చాటో తప్పించుకుంటాడు.
 
ప్రచార సాధనమౌతున్న రణమంత్రం
సరిహద్దు గుండెల మధ్య ముళ్ళ కంచె..
ఉన్మాదతంత్రం కొల్లగొడుతున్న భద్రత
హిమఖండంలో చావునగారా
కాకులపహారాలో గాయాలోడుతూ
కుంకుమ పూలు.
ద్వేషం విషమై
పెత్తనం కత్తులు దూస్తున్న చోట
నెలవంక మీది ప్రేమ అబద్ధం
రాబందులకు ఎర్రతివాచీ పరిచి
భయాన్ని పొదిగే నిశ్శబ్దం.
ఉనికి చుట్టూతా ఓ ‘ఉక్కపోత’.
 
మనసుల మధ్య
కమ్యూనికేషన్‌ తెంపేసినంక
మనుషులంతా దారితప్పిన ఉపగ్రహాలే.
గాలీ ఆడదు
బలివితర్దిగా మారిన నేలా నోరెత్తదు
స్వేచ్ఛ చుట్టూ అప్రకటిత నిర్బంధం
చీకటి గుయ్యారాల్లో ప్రశ్న బందీ.
ఊపిరికోసం విలవిలలాడటం నేరం.
దిగులు గుండెల తాయిమాయిని
తలపుకెత్తుకున్న
అసహనం కూడా నిషేధిత భాషే.
పడగ నీడలో
గుండెల్ని కలిపి కుట్టడమూ ద్రోహమే...
వఝల శివకుమార్‌
94418 83210