విప్లవ రచయితల సంఘం యాభై ఏళ్ళ వేడుకలు ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా కొందరు రచయితలను, కవులను, ‘విరసం సాఫల్య వైఫల్యాలపై అభిప్రాయం చెప్పమ’ని అడిగాం. దానికి వారి స్పందనలను ఇక్కడ ప్రచురిస్తున్నాం. 

తనని తాను దిద్దుకుంటూ విస్తరిస్తోంది

విరసం వొక సాహిత్య సంస్థగా యాభై యేళ్ళుగా కొనసాగడం సాహిత్యావసరం. సామాజిక అవసరం. సమాజానికి అవసరం లేనిది యేదైనా దానికదే కనుమరుగై పోతుంది. విరసం దానికి అతీతం కాదు. విరసం అవసరం యివాల్టికీ వుంది కాబట్టే మనగలిగి వుంది. 1970ల నాటి సామాజిక సందర్భాన్ని ఆపై 1975ల నాటి ఎమర్జెనీ కాలాన్ని గుర్తుచేసుకుంటే యివాళ వున్న కాలం దానికి అతీతమైం దేమీ కాదు. రాజ్యం చాలా స్మార్ట్‌ అయింది. ప్రజల్ని బలహీనతల్లోకి నెట్టి ఆ బలహీనతలనే తన బలంగా వాడుకుంటోంది. అందుకనే ప్రశ్నించే విరసం అనివార్యమైన నిర్భంధానికి అప్రకటిత నిషేధానికి గురైవున్నా, అనేకమంది సభ్యులు జైలుపాలైనా కేసులు యెదుర్కొంటున్నా, సాహితీ సృజన నిరంతర ధారగా కొనసాగుతోంది. 
 
విరసం అదెందుకు చెయ్యలేదు? ఇదెందుకు చెయ్య లేదు?- అని ప్రశ్నలు అన్ని సందర్భాలలో సంస్థ యెదుర్కొం టూనే వుంది. తెలీకుండానే విరసానికి ఆ స్థానం యిచ్చి మరీ విమర్శ చేస్తున్నారు. అన్నీ వేదాల్లో వున్నాయన్నట్టు అన్నీ విరసంలో వుండాలని కోరుకుంటున్నారు. అది కూడా బ్రాహ్మణీయ భావజాలమే. ఏ సంస్థకయినా దాని పరిమి తులూ పరుధులూ దానికుంటాయి. అందుకనే స్త్రీవాదం దళితవాదం మైనారిటీవాదం ప్రాంతీయ అస్తిత్వ వాదాలకు కాలసిన భూమికను కాకపోయినా అవి యేర్పడడానికి కావలసిన యెరుకను పరోక్షంగా కలిగించిన తననే నిలదీ స్తుంటే తెలియకనే విరసం ఆత్మరక్షణలో పడింది.
 
ఆపై అర్థం చేసుకుంది. కలిసి నడిచింది. దానికి తనదైన తాత్విక తను అద్దింది. సాహిత్యం దానికది అక్షరంగా మిగలడం వేరు. ఆచరణగా వుండగలగడం వేరు. ఆచరణలో వున్నప్పుడే విజయాలతో పాటు వైఫల్యాలు వుంటాయి. అలాగే వైయక్తికమైన అంశాల్ని సామాజికాంశాలే ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే విరసం ఆ గీత దాటి మనిషి కేంద్రంగా అంతరంగ ప్రపంచాన్ని సహితం ఆవిష్కరించడంలో సాహిత్య పరిపుష్టినీ సమగ్రతనీ సాధిస్తుందని నమ్మకముంది. విరసం తనని తాను దిద్దుకుంటూ విస్తరిస్తోంది.
బమ్మిడి జగదీశ్వరరావు 
 
ప్రజల ధర్మాగ్రహానికి ఒక దిక్సూచి
ఉద్యమానికి అంతిమ విజయం అంటూ ఒకటి ఉంటుంది. కానీ అంతిమ విజయానికి ముందు, ఉద్యమం పెరుగుతున్న క్రమంలో, విజయాలు ఉండవా? సమాజంలో ఆర్థిక నేరాలు పెచ్చుపెరిగిపోయినాయి. కానీ, ఈ వ్యవస్థలో ఆర్థిక నేరాలకు శిక్షలు లేవు. ఆర్థిక నేరాలు చేస్తున్నవారే ఎన్నికల బరిలోకి దిగి రాజ్యాధికారం హస్తగతం చేసుకుంటూ వున్నారు. డబ్బు రాజకీయాధికారాన్ని సంపాయించి పెడితే, రాజకీయాధికారం మళ్ళీ డబ్బును సంపాదించి పెడుతుంది. లైంగిక నేరాలకు సరైన శిక్షలు లేనప్పుడు ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సందర్భాలను ఇప్పుడు మనం చూస్తున్నం. ఆర్థిక నేరాలకు సరైన శిక్షలు లేనప్పుడు, ప్రజలు భవిష్యత్తులో ఏ విధంగా ప్రతిస్పందిస్తారో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఇదే జరుగుతూ ఉంది.
 
ఎన్నికల ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వారు ఏ రాజకీయ వ్యవస్థను కోరుకోవచ్చో దాన్ని విప్లవోద్యమం ప్రజల భావజాలంలోకి బలంగా ప్రవేశపెట్టగలిగింది. ఇది ప్రజల భావజాల వ్యవస్థలో విప్లవోద్యమం సాధించిన మౌలిక విజయం. ఎన్నికల ప్రభుత్వాలు చేసిన భూసంస్క రణల చట్టం, బ్యాంకుల జాతీయం, వెట్టి చాకిరీ నిర్మూలన మున్నగు చట్టాల వెనుక విప్లవోద్యమ ప్రభావం లేదని చెప్పలేం. న్యాయవ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ- ఈ మూడు వ్యవస్థలూ వైఫల్యం చెందిన క్రమంలో విప్లవోద్యమం సామాన్యులవైపు నిలబడి సాధించిన విజయాలు ఈ సమాజానికి తెలుసు. పట్టణాలలోని సామాన్యులు ప్రస్తుతం అవినీతిపరులను ఎదుర్కొనే క్రమంలో రెడ్‌ ఆర్మీ నిర్మాణం గురించి కలలు కనడం ఒక పరిణామం. ప్రజల ధర్మాగ్రహానికి ఒక దిక్సూచిని ప్రతిపాదించిన విప్లవోద్యమం విస్మరించలేనిది.
బండి నారాయణస్వామి