నన్నయతో మొదలై ఆధునిక యుగం మొదలుగా చెప్పబడుతూన్న క్రీ.శ.1800 వరకూ మధ్యలో దాదాపు ఎనిమిది శతాబ్దాలుగా సాగిన తెలుగు సాహిత్య ప్రస్థానంలో వివిధ కాలాల్లో తిక్కన, పోతన, శ్రీనాథాది మహాకవుల రచనలలో ఆయా కాలాల సామాజిక చింతనకు, రాజకీయ స్పృహకు అనుగుణంగా జరిగిన మార్పులను గుర్తించి, విశ్లేషించి, నిష్పాక్షిక దృష్టితో అర్థంచేసుకుని, అభినందించే ప్రయత్నం అవసరమైనంత స్థాయిలో మనం చేశామా, చేస్తున్నామా? అనే ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం దొరకడం సులభం కాదు. 

భారత ఆంధ్రీకరణ బృహత్సౌధానికి పటిష్ఠమైన పునాదిని వేసే క్రమంలో, ఆ పునాది గట్టిదనానికి నన్నయ ఎంచుకున్నది కేవలం సంస్కృతము, తెలుగు అన్న భాషలే కావనీ, కాలానుగుణంగా ఆనాటికి వృద్ధి చెందిన హేతుబద్ధ ఆలోచనా సరళికి అనుగుణంగా వలసిన మార్పు చేర్పులను చేయడం ద్వారా అది సాధించదలిచాడనీ, అదే ఆధునికతకు అంతఃసూత్రమనీ, అది సాధించడంలో కృతకృత్యుడైన నన్నయ తన నాటికి తాను ఆధునికుడనీ నిరూపించగలిగే సందర్భాలు నన్నయ రచిత భారత భాగంలో చాలానే కనిపిస్తాయి.
 
కాలప్రవాహంలో ఏరోజుకారోజు, ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఏ క్షణానికి ఆ క్షణం ఆధునికమైనవే అనే సాధారణ సూత్రం స్థూలంగా సాహిత్యానికీ వర్తిస్తుందన్నది వొప్పుకోవడమే సమంజసమైనది. అయితే, సమకాలీన సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యం ఇత్యాది గుణాలు ప్రతిబింబించేదే ఆధునిక సాహిత్యానికి లక్షణంగా చెప్పుకుని చేసిన యుగ విభజనలో- తెలుగు సాహిత్యానికి ఆధునిక యుగం క్రీ.శ.1800 తరువాతనే మొదలైం దనీ, ఆ కారణంగా అంతకు ముందటిదంతా సనాతన సాంప్రదాయ సాహిత్యమనీ, కనుక అందులో ఆధుని కతకు తావే లేదనే అభిప్రాయం పెంచి పోషించబడి, సామాజికంగా అభ్యుదయాన్ని ఆశించేవారు ఆ సాహిత్యం జోలికి పోకపోవడం వలన జరిగే నష్టం ఏమీ లేదనే దురభిప్రాయం క్రమంగా స్థిరపరచబడింది.
 

నన్నయతో మొదలై ఆధునిక యుగం మొదలుగా చెప్పబడుతూన్న క్రీ.శ.1800 వరకూ మధ్యలో దాదాపు ఎనిమిది శతాబ్దాలుగా సాగిన తెలుగు సాహిత్య ప్రస్థా నంలో వివిధ కాలాల్లో తిక్కన, పోతన, శ్రీనాథాది మహా కవుల రచనలలో ఆయా కాలాల సామాజిక చింతనకు, రాజకీయ స్పృహకు అనుగుణంగా జరిగిన మార్పులను గుర్తించి, విశ్లేషించి, నిష్పాక్షిక దృష్టితో అర్థంచేసుకుని, అభినందించే ప్రయత్నం అవసరమైనంత స్థాయిలో మనం చేశామా, చేస్తున్నామా? అనే ప్రశ్నలకు సంతృప్తికర సమా ధానం దొరకడం సులభం కాదు. ఆ దిశగా చిన్న ప్రయ త్నమే ఈ వ్యాసంలో జరిగింది. నన్నయ ఆంధ్రీకరించిన భారత భాగంలోంచి రెండు సందర్భాలను ఎన్నుకుని, మూలానికీ ఆంధ్రీకరణానికీ జరిగిన మార్పు చేర్పులలో ఆనాటి ఆధునిక ఆలోచనా విధానానికి అనుగుణంగానే జరిగినవిగా అనిపించే మార్పులేమిటో, ఆ మార్పులను చేసి నన్నయ ‘తన నాటికి తాను ఆధునికుడే!’ అన్నది ఎలా చెప్పకనే చెప్పాడో, ఇందులో నిరూపించడం జరిగింది.

వ్యాసభారతాన్ని ఆంధ్రీకరించే క్రమంలో అనుసరించిన పద్ధతిని గురించి మాట్లాడుకునే సంధర్భం వచ్చినపుడల్లా, అనవసర మనుకున్న భాగాలను తగ్గించి, అవసరమనిపించిన చోట్ల పెంచి వ్యాస భారతంలో లేని కొన్ని మార్పులూ చేర్పులూ చేసి, ఆంధ్ర భారతాన్ని సంస్కృత భారతానికి మక్కికి మక్కి అనువాదంలా కాకుండా ఒక స్వతంత్ర రచన అనిపించే విధంగా, తన ప్రభువైన రాజరాజ నరేంద్రుని కోరికకు అను గుణంగా కొనసాగించి, ఆ క్రమంలో తెలుగులో అదే మొదలైన ఒక నూతన పద్ధతికి నాంది పలికి, ముందు తరాలకు అను సరణీయంగా అందించాడు నన్నయ అని చెప్పడం పరిపాటి. అయితే, వ్యాస భారతంలోని భాగాలను తగ్గించడమూ, పెంచ డమూ, మార్పులూ చేర్పులూ చేయడం అనే ప్రక్రియకు అవసరం, అనవసరం అనే మాటలనే ప్రమాణాలుగా చూపి సరిపుచ్చుతూ వచ్చాముగాని, ఆ ‘అవసరానికి’ కాని, ‘అవసరం లేదు’ అనిపించడానికి కాని ఏది అసలైన కారణమో కాస్త లోతుగా పరిశీలన చేసినది లేదు. ఆ ‘కారణం’ తానున్న కాలంలో వ్యక్తుల, సాంప్రదాయ విద్యావంతుల ఆలోచనా విధానంలో ఆనాటికి చోటుచేసుకున్న నవ్యతకు, హేతుబద్ధతకు, దానికి అనుగుణంగా కథలోని సంగతులను అర్థం చేసుకుని అసంబద్ధతను ప్రశ్నించగలిగే ధోరణికి అనుగుణంగా రచన ఉండాల్సిన అవసరం వలన యేర్పడినది అయివుండొచ్చునని, అది అప్పటికి కాలానుగుణంగా రూపుదిద్దుకున్న ఆధునికత అని, ఆ అవసరాన్ని గుర్తెరిగి రచన సాగించిన నన్నయ తన కాలానికి తాను ఆధునికుడే అని అర్థంచేసుకునే ప్రయత్నం మనం చేయలేదు.
 
నన్నయ కవిత్వం అంతా సంస్కృత పదాలమయం అని ఒక ముద్ర పడిపోయింది. అందులోని నిజానిజాల మాటెలా వున్నా, ఆ వ్యాఖ్య అర్థం నన్నయ కవిత్వంలో అసలు తెలుగు మాటలు లేవని కాదు. నన్నయ కవిత్వంలో అందమైన అచ్చ తెలుగు నుడికారం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ వ్యాసానికి గాను నన్నయ భారత భాగంలోని తెలుగు మాటలలోంచి (‘తెలిసి తెలిసి’ అనే అర్థంలో ఉపయోగించిన) ‘యెఱిగి యెఱిగి’ అనే జంటపదాల తెలుగు నుడికారాన్ని గ్రహించి, ఆ నుడికారం ప్రయోగంతో నన్నయ తన నాటి భావజాలానికి అనుగుణంగా ఆంధ్ర భారతంలో చేసిన మార్పును, ఆధునీ కరణను విశదీకరిస్తాను.
 

తెలివిడి, ఎరుక- ఈ రెండూ తెలుగు మాటలే. అయినా నన్నయ ఈ రెంటిలో ‘ఎరుక’ అనే మాటకే ఎక్కువ ప్రాధా న్యత ఇచ్చి తన రచనలో ప్రయోగించాడు. ఆయనకు ‘ఎరుక’ అనే మాటపై, చెప్పలేనంత మమకారం వున్నట్లుగా కనబడు తుంది. అలాగే ఈ ‘ఎరుక’ అనే మాటనుంచి పుట్టిన జంట మాటల నుడికారం ‘యెఱిగి యెఱిగి’ అనే జంట పదం అన్నా కూడా నన్నయకు మాటలలో చెప్పలేనంత మమకారం. ఈ జంట పదం ఇప్పుడు వాడకంలో వున్న ‘తెలిసి తెలిసి’ అన్న రూపంలో నన్నయ భారతంలో కనబడదు. ఎన్ని సందర్భాలలో ఈ జంట మాటల నుడికారాన్ని నన్నయ ప్రయోగించాడో అన్ని సందర్భాలలోనూ తప్పనిసరి పరిస్థితులకు లోబడిగానీ, మరే కారణంచేతగానీ, తెలిసితెలిసీ మనుషులుచేసే తప్పులకు, మనసు మూలుగుతూ నిస్సహాయంగా పడే బాధ ఎలా వుంటుందో వారి వారి మాటలలోవ్యక్తీకరించి చూపించాడు నన్నయ. ఈ వ్యాసంలో పరిశీలనకై ఎంచుకున్న అలాంటి రెండు సందర్భాల లోని పద్యాలలో మొదటిది ఆదిపర్వం, తృతీయాశ్వాసం లోని 5వ పద్యం:

యెఱిఁగి యెఱిఁగి వారి నేల వారింపర;
యిట్టి గోత్రకలహ మేల పుట్టె?
దీని కలతెఱంగు దెలియంగ నానతి
యిండు నాకు సన్మునీంద్రవంద్య!
 
వ్యాసభగవానుని శిష్యులలో ఒకడైన రోమహర్షణుని కుమారు డైన ఉగ్రశ్రవసుడనే సౌతి, నైమిశారణ్య పుణ్యప్రదేశంలో లోక కళ్యాణార్థం 12 సంవత్సరాలు సాగే సత్రయాగం చేస్తూ వున్న శౌనకాది మహామునుల వద్దకు వచ్చినపుడు, ‘మీరు ఏ కథను నా నుంచి వినాలని కోరుకుంటున్నారు?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా వారు మహాభారత కథను వినాలని కోరుకుం టున్నాము అని చెప్పగా, ఆ కథనే చెప్పడం మొదలెడతాడు. ఆ కథలో పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జనమేజయుడు వ్యాస భగవానుని అడిగిన ప్రశ్న ఈ పద్యం. మహాభారత కథ మొత్తానికి కీలకమైన ప్రశ్న ఇది. ‘‘జరగబోయే మహా సంగ్రామం వలన అపార జననష్టం జరుగుతుందన్నది ‘తెలిసి తెలిసీ’ భీష్మద్రోణాది మహాపురుషులు, ఇరువైపులలోనూ పెద్దవారు, ఇరుపక్షాలవారినీ సమాధాన పరచి వారిని ఎందుకు వారించ లేకపోయారు? అసలు అంత భయంకరమైన వంశకలహం ఎలా పుట్టింది? దానికి అసలు కారణం యొక్క యదార్థ స్థితిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని పై పద్యం భావం. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, మూలంలో, అంటే వ్యాసుని భారతంలో, జనమేజయుడు వ్యాసభగవానుని ‘తెలిసి తెలిసీ మీరు ఎందుకు వారిని వారించలేదు?’ అని ప్రశ్నించినట్లుగా వుండదు. నన్నయ పద్యానికి మూలమైన సంస్కృత భారతంలోని (క్రింద ఇవ్వబడిన) మూడు శ్లోకాల భాగాన్ని చూస్తే అది స్పష్టమవుతుంది.
 
జనమేజయ ఉవాచ:
కురూణాం పాణ్డవానాం చ భవాన్‌ప్రత్యక్షదర్శివాన్‌

తేషాం చరితమిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ !!

జనమేజయుడు అడిగాడు: ‘‘స్వామీ! మీరు పాండవుల కౌరవుల నడవడిని ప్రత్యక్షంగా చూశారు. కనుక నేను మీ ముఖతహ వర్ణించబడే వారి చరిత్రను వినాలని కోరికతో వున్నాను.’’
కథం సమభవద్‌ భేదస్తేషామక్లిష్టకర్మణామ్‌
తచ్చ యుద్ధం కథం వృత్తం భూతాన్తకరణం మహత్‌ !!
 
= ‘‘వారు రాగద్వేషాది దోషాలకు అతీతులైనవారు, సత్కార్యా లనే చేసే అలవాట్లు కలవారు. అటువంటి వారిలో, ఒకరిపై ఒకరికి బేధభావాలు యెట్లా ఉత్పన్నమ్యాయి? ఎంతోమంది ప్రాణాలను అంతం చేసినటువంటి మహాయుద్ధం వారి మధ్య ఏవిధంగా జరిగింది?’’
 
పితామహానాం సర్వేషాం దైవేనానిష్టచేతసామ్‌ !
కార్త్స్యేనైతన్మమాచక్ష్వ యథావృత్తం ద్విజోత్తమ !!
= ‘‘స్వామీ! నాకు తెలిసినదేమనగా, ప్రారబ్ధమనేదే ప్రేరణ చేసి, మా ప్రపితామహుల మనస్సులను యుద్ధరూపమైన అనిష్ఠలో లగ్నంచేసింది అని. వారిదైన సంపూర్ణ వృత్తాంతాన్ని నాకు మీరు జరిగింది జరిగినట్లుగా వర్ణించి వివరించ వలసింది.’’
 
మూలంలోని ఈ మూడు శ్లోకాలను, వాటి భావాన్ని గ్రహిం చిన మీదట, ఆంధ్రభారతంలోనిపై పద్యంలో, మొదటి పాదంలో వేయబడిన ప్రశ్న ఖచ్చితంగా నన్నయ ఆ సందర్భంలో చేసిన చేర్పు అని విదిత మవుతుంది. దీనికి కారణం ఆలోచిస్తే అది తన కాలానికి అనుగుణంగా నన్నయ చేసిన ఆధునీకరణలో ఒక భాగం అని కూడా అనిపిస్తుంది. కాలాలు మారుతున్న కొలదీ మూల మహాభారత గ్రంథానికి చేర్పులు జరిగి పాతిక వేల శ్లోకాలతో ఉన్న గ్రంథం కాస్తా లక్ష శ్లోకాల మహా గ్రంథంగా ఎలాగైతే మారిందో, అలాగే తరాలు గడిచే కొలదీ మహాభార తంలోని విషయాలపై అవగాహన, కొన్ని కొన్ని సందర్భాలలో అందులోని వ్యక్తుల ప్రవర్తనపై విమర్శనా దృష్టి కూడా పెరిగి పాఠకుల మనస్సులలో వారి వారి దృక్కోణాలకు అనుగుణంగా, మహాభారతంలో జవాబు దొరకని కొన్ని సందేహాలూ, ప్రశ్నలూ ఉదయించాయి. నన్నయ కాలానికి ఆదిలోనే అలా ఉదయించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ‘యుద్ధం జరిగితే అపారమైన జననష్టం, ఆస్తినష్టం జరుగుతుందని తెలిసి కూడా భీష్మ, ద్రోణాదులైన పెద్దలు కురుపాండవుల మధ్య వైరం యుద్ధం దాకా వెళ్ళకుండా ఎందుకు ఆపలేకపోయారు? యుద్ధం జరగ కుండా ఆపడానికి వారి వైపునుంచి నిజమైన ప్రయత్నం అసలు జరిగిందా? నిజంగా జరిగితే దాని పర్యవసానం అంత ఘోరంగా ఉండకపోను గదా?’ అన్నవి. వీటన్నిటి భావాన్నే ‘యెఱిగి యెఱిగి’ అన్న ఒక్క జంటపదాలతెలుగు నుడికారంలో గర్భితం చేసి జనమేజయుని ద్వారా అడిగించాడు నన్నయ. తన కాలం నాటికి విజ్ఞుల మనస్సులలో ఉదయించిన సందేహాన్ని పై పద్యం మొదటి పాదంలో అలా చేర్చి ఆనాటికి మహా భారతాన్ని అలా ఆధునీకరించాడు నన్నయ అని తేలుతుంది.
 
ఇప్పుడు రెండవ సందర్భంగా, ఆదిపర్వం, తృతీయా శ్వాసం లోనిదే ‘యయాతి చరిత్ర’ లోని పద్యాన్ని పరిశీలిద్దాం.
 
తగిలి జరయు రుజయు దైవవశంబున
నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగికడఁగి యారెంటిఁ జే
కొందురయ్య యెట్టి కుమతులైన?
 
‘‘ముసలితనం గాని, రోగం గాని దైవవశంగా సంభవిస్తే ఎవరైనా ఇక తప్పదు గనుక అనుభవిస్తారుగాని, తెలిసి తెలిసీ ఈ రెండు బాధలను ఎంత బుద్ధిలేని వాడైనా తనంత తాను స్వీకరిస్తాడా?’’ అని ఈ పద్యం భావం. ఇది కూడా మూలంలో లేనిదే. మూలంలోవున్న వాటిని సంక్షేపిస్తూ నన్నయ కూర్చిన ఒక అందమైన పద్యం ఇది. మూలంలో యయాతి తన పుత్రులలో ఒక్కొక్కడినే పిలిచి తన ముసలితనాన్ని స్వీకరించి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మంటాడు. చివరి కుమారుడైన పూరుడు తప్ప మిగిలిన నలుగురు కుమారులు (యదు, తుర్వసు, ద్రుహ్యు, అను అనువారు) ‘‘ముసలితనం ఒక భరించ లేని బాధ. అందులో శరీరం దుర్బలమవుతుంది. మడతలు పడుతుంది. వెంట్రుకలు తెల్లబడతాయి. తీసుకున్న ఆహారం కూడా సరిగా వొంటికి పట్టక అనేకమైన బాధలకు కారణమ వుతుంది’’ అని ఒకరికి తరువాత ఒకరువారి మనసుకు తోచిన బాధలు వివరంగా చెప్పి, తండ్రి కోరికను నిరాకరించడం ఈ పద్యానికి సందర్భం. ‘యెఱిగి యెఱిగి’ అన్న ఒక్క తెలుగు నుడి కారంతో ఆ మొత్తాన్నీ సంక్షిప్తం చేసి, అదనంగా వ్యాసభార తంలో లేని, వారి నిరాకరణకు సామాన్యుని చిత్తానికి సహజ మైనదిగానూ, సహేతుకమైనదిగానూ అనిపించే అసలైన కారణాన్ని ఆంధ్ర భారతంలో చేర్చి, సామాన్యుని ఆలోచనా విధానం ఆ సందర్భంలో ప్రతిబింబించేలా ఆధునీకరించాడు నన్నయ.
 
మచ్చుకు ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. భారత ఆంధ్రీకరణ బృహత్సౌధానికి పటిష్టమైన పునాదిని వేసే క్రమంలో, ఆ పునాది గట్టిదనానికి నన్నయ ఎంచుకున్నది కేవలం సంస్కృతము, తెలుగు అన్న భాషలే కావనీ, కాలాను గుణంగా ఆనాటికి వృద్ధిచెందిన హేతుబద్ధ ఆలోచనా సరళికి అనుగుణంగా వలసిన మార్పు చేర్పులను చేయడం ద్వారా అది సాధించదలిచాడనీ, అదే ఆధునికతకు అంతఃసూత్ర మనీ, అది సాధించడంలో కృతకృత్యుడైన నన్నయ తన నాటికి తాను ఆధునికుడనీ నిరూపించగలిగే సందర్భాలు నన్నయ భారత భాగంలో చాలానే కనిపిస్తాయి.
 
భట్టు వెంకట రావు