చరిత్ర వుండేది, మనకు 
ఇంత క్రితం కూడా.
అప్పుడు లేనిది మనమే. 
అనుకుంటున్నాం, మనం 
మనమే సాక్షులమని 
వస్తువులకు మొక్కలకు 
మానులకు జీవులకు కూడా. 
అనుకుంటున్నాం,
వాటి సృష్టి కూడా మన కోసమేనని 
అట్లా అనుకోవటం లేవు, అవి. 
మన పుట్టుకకు సాక్షులవి
మనకు దీవనలు అందించాయవి 
నీరు, నీడ 
పూలు పాలు పండ్లు ఇచ్చినవి, అవే. 
భయం భయంగా చూశాం వాటిని,  
                       మొదట్లో 
ఆరాధించాం, ఆ తరువాత 
తొలగించాం చరిత్ర నుంచి, 
బానిసలుగా చేసాం చివరిగా
మీరు ఎప్పుడైనా చూసి నిలబడ్డారా,
అరక్షణమైనా, 
సొంత సోదరులు అమ్మకమవటం 
ఒళ్ళు చీల్చి కలప దుకాణాల్లో 
లేకపోతే నెత్తురోడుతూ 
వేలాడటం మాంసపు దుకాణాల్లో 
ఇక ఎక్కువ సమయం లేదు 
మన వంశానికి, ఇక్కడ. 
మన ఆవిష్కరణలే 
 మనను చెరిపివేస్తాయి.
మన ఉదయాన్ని చూసినవాళ్లే, 
      ఉత్సాహంతో,
చూస్తారు అస్తమయాన్ని కూడా, 
         నిస్సంగంగా 
మన తరువాత కూడా వుంటాయి, అవి 
మనం వచ్చి వెళ్ళిన కథ, 
కొన్ని మాటలకు మించని మన కథ, 
వ్రాయడానికి 
ఊదారంగు శిలలపైన, 
 హరిత పత్రాలపైన,
నీలిమబ్బునుంచి కురిసే వాన చినుకుల
 సిరా వేళ్ళతో, 
ఆకుల నరాల తాబేల పెంకుల  
రహస్య భాషలో, వ్రాయడానికి 
సొంత స్పర్శినితో ఏరుకున్నవి-- 
దేవుడూ అవీ మాత్రం మిగిలిన  
ప్రపంచపు సూక్ష్మ చరిత్ర, వ్రాయడానికి
మలయాళ మూలం: సచ్చిదానందన్‌
తెలుగుసేత: ఎల్‌. ఆర్‌. స్వామి 
అనువాదకుని సెల్‌: 99490 75859