రాత్రి గడవనంటోంది. 
కల మెలకువ రెండూ కలిసిపోయాయి.
ఎంత సుదీర్ఘ రాత్రి ఇది? 
చలికి లోకమంతా గడ్డకట్టింది. 
ఇళ్లన్నీ శవ పేటికల్లా కనిపిస్తున్నాయి. 
ఆరోజు సాయంత్రం పక్షులు గూళ్లకుమళ్లే సమయంలో అందరిలో కనిపించావు. ఎప్పటిలాగే నిన్ను చూడగానే మాటలు రాలేదు. నీ తలపై కిరీటమేదో 
మెరుస్తోంది. నిన్ను చూడగానే లోకమంతా ఏదో వేడుక జరుగుతు న్నట్టుగా మారింది. కొత్త అత్తరు సువాసననేదో అంత దూరానికి వచ్చింది. మైకం 
కమ్మినట్టయింది
 
నిన్ను కలిశాక లోకమంతా రెట్టింపు అందంగా.. ఆ ఒక్క గంటా, ఆ ఒక్క పూటా మాత్రమే జీవితంలో బతికున్నట్టనిపిస్తుంది. ఎదురు చూసే క్షణాలన్నీ 
ప్రాణం పోసుకునే ముందరివి. కలిసినవన్నీ జీవంతో కళకళ లాడేవి. ఆ తర్వాతంతా నిస్తేజమే.
 
ఇల్లు శుభ్రం చేసి, తలత్‌ స్వరం వెలిగించాను. మోహా వేశాలేవో గుండె అంచును తాకి పోతున్నాయి. నిన్ను కలవబోయే క్షణాన్ని తలుచుకుని 
ఉక్కిరిబిక్కిరవుతు న్నాను. రావేమో అని ఓ పక్క గుబులుగా ఉంది.. నువ్‌ వస్తున్నావు కదూ..!
 
గంటలు గడుస్తున్నాయి. తలుపులు, కుర్చీలు చల్లబడు తున్నాయి. వాకిట్లో చెట్ల ఆకులు వణుకుతున్నాయి. మంచుకు చలిమంట ఆరి పొగ లేస్తోంది. 
వాకిట్లో పారిజాతాల పరిమళం గుచ్చుకుంటోంది. ఎంత సుదీర్ఘ రాత్రి ఇది?
 
కిరణ్‌ చర్ల
kiran24x7@gmail.com