ఆబాలగోపాలం మెచ్చే ‘అగ్రహారం కథలు’

నవ్య వీక్లీలో వారమంతా ఆయన రచనలకోసం ఎదురుచూస్తారంతా. ఆయన హాస్యోక్తులకోసం, వ్యక్తిత్వ వికాసాన్నీ, మానవత్వపు ఉన్నతీకరణలను చాటి హృదయాలను పెనవేసే అక్షర బంధాలకోసం, పాలకోసం వెదకులాడే పసిపాపలై వెతుక్కుంటారంతా. ఏ సభలో పాల్గొన్నా ఆయన చతురోక్తులకోసం, సరస సంభాషణలకోసం ఎదురుచూస్తారంతా. 

ఆయన పిల్లల్లో పిల్లవాడు, పెద్దల్లో పెద్దవాడు, యువకుల్లో యువకుడు, మేధావుల్లో మేధావి, సరస స‍ంభాషణల చతురుడు, సవ్యసాచి లాంటి రచయిత, సాహిత్యవేత్తలమధ్య మేరునగధీరుడైన కథకుడు...ఆయనే అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ. సింపుల్‌గా ఎ.ఎన్‌.జగన్నాథశర్మ. అరణి, అనీలజ, వైనతేయ, శివసతీపురం శర్మ, లహరి...కలం పేర్లు ఎన్ని ఉన్నా ఒన్‌మన్‌ ఆర్మీ. సకలదేవతలనుంచీ తన అమ్ములపొదిలోకి ఆయుధాలు సమకూర్చుకుని దుష్టశిక్షణ చేసే శ్రీదేవీభాగవత లీలల్ని భాషాసంకెళ్ళ చెరలో బంధించకుండా పండిత పామరులు మెచ్చేలా పేదరాశిపెద్దమ్మ కథలా రాస్తూ మరోసారి తన సాహితీ రసకౌశలాన్ని నిరూపించుకోవడమేకాదు, తన జన్మ ధన్యం చేసుకుంటున్నారాయన. ఇంకా చెప్పాలంటే బాల్యం నుంచీ ముఖ్యంగా కథ, నవల, నాటకం, వ్యాసం, టీవీ సీరియల్‌, సినిమా, సరళ తెలుగులో రామాయణ, భారత, భాగవతాది పురాణేతిహాస రచనలు...ఇలా అన్ని ప్రక్రియల్నీ తన సాహిత్య తూణీరంలో పొదువుకుని, ఓవైపు కథకు కావలి కాస్తూ, మరోవైపు సవ్యసాచిలా అక్షర సేద్యం చేస్తున్నారు. 

ఆ పరంపరలో భాగమే ఇటీవల వెలువడిన జగన్నాథశర్మగారి తాజా పుస్తకం ‘అగ్రహారం కథలు’. 103 కథలున్న అగ్రహారం కథల్లో ఆర్ర్దత కనిపిస్తుంది. అట్టడుగు జీవితం కనిపిస్తుంది. పేరుకి అగ్రహారం కథలే, అగ్రహారంలోని కథలే, ‘‘అసింటా ఉండరా వెధవాయ్‌..!’’ అనే చాదస్తాన్ని తలకెక్కించే కథలు మాత్రం కావివి, కాలప్రవాహ మూలికావైద్యంలో ఆ చాదస్తం విరిగి వన్నెకెక్కి అందరినీ అక్కున జేర్చుకున్నాయని చాటిచెప్పే కథలు. ప్రగతిశీల భావాలు గలవారి నుంచి పరమనిష్ఠా గరిష్ఠులవరకు అందరూ చదివి మెచ్చుకునే కథలివన్నీ.అగ్రహారంలో ప్రతి పువ్వునీ, ప్రతి చెట్టునీ, ప్రతి నీటి చుక్కనీ చూసి పరవశించి, పులకించి రాసిన జగన్నాథశర్మ జీవితానుభవం లోంచి పుట్టిన కథలివన్నీ. నిక్కచ్చిగా పోల్చి చెప్పాలంటే, ఆర్కే నారాయణ ‘మాల్గుడి డేస్‌’, సత్యం శంకరమంచి ‘అమరావతి కథలకోవకు చెందినవే ఈ ‘అగ్రహారం కథలు’. 

‘మచ్చుకి ‘పెదవులూనిన చోట..!’ అనే కథ చదివితే, ‘‘సిల్లరని యేడ నుంచి తేను’’ అంటూ పడవనడిపే కమిలి సరదాగా నవ్వుతూ మనకు కనువిందే చేస్తుంది. ‘‘ఈ గట్టున నువ్వు పాడితే ఆ గట్టు మేలుకోవాలి’’ అని అంటే, ‘‘నీటి పాట సాలదా? నా నోటి పాటేల?’’ అంటూ నీటి మీద నిద్రగన్నేరులు జల్లినట్టు సుతిమెత్తగా పలికే కమిలిని, పదో తరగతి పాసైన అగ్రహారం కుర్రాడు పెళ్ళి చేసుకుంటానని మోజు పడితే, ‘‘ఈ పిల్ల ముద్దు నీకెందుకయ్యా! పెద్దయి, పెళ్ళి చేసుకుంటే పట్నం పిల్ల ముద్దిస్తదిలే’’ అని బుద్ధులు చెబుతుంది. పసుపు పారాణితో పెనిమిటితో వచ్చి, పంతులుగారి ఆ పిల్లాడి పాదాలు ముద్దాడి అతడి కోరిక తీరుస్తుంది కమిలి. ఇలా ఈ కథల్లో ఆయన శైలీ విన్యాసం, భాషా మహత్తు కథ కథకీ మనల్ని ఆ మత్తులో సోలిపోయేట్టు చేస్తుంది. తెలుగు భాష తియ్యందనం కోసం మొహవాచిపోయినవారంతా రసాత్మకమైన శర్మగారి అక్షరాల జల్లుల్లో తడిసి తపన తీర్చుకోవాలంటే ‘అగ్రహారం కథలు’ చదవాల్సిదే.

జగన్నాథశర్మ
ధర : 207 రూపాయలు, పేజీలు : 240
ప్రచురణ: ఎస్‌.ఆర్‌. పబ్లికేషన్స్‌, డి.ఆర్‌.ఆర్‌.వీథి, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, (అంబాపురం), విజయవాడ (రూరల్‌), ఫోన్‌ 0866–24 36 959., సెల్‌ 94 948 75 959
ప్రతులకు : శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్‌, 11–25–119, మెయిన్‌ బజారు, విజయవాడ–1 
ఫోన్‌ 0866–24 21 052., సెల్‌ 98 491 81 712