ఎనిమిదేళ్ళ తక్కువ కాలంలో ప్రభంజనంలా దూసుకుపోయిన రచయిత్రి అనురాధ సుజలగంటి. యాభైకి పైగా కథలు, పది నవలలు రాశారు. ఆమె కథల్లో, నవలల్లో స్ర్తీ స్వతంత్ర్య ఆలోచనాధోరణి, సమాజంపట్ల నిశిత పరిశీలన, సవాళ్ళను ప్రతిఘటించి జీవితాన్ని ఎదురీదే ధీరత్వం, ఏదో సాధించాలనే తపనతో కృషిచేసి ఉన్నత స్థానాలకెదిగిన పాజిటివ్‌ దృక్పథంగల మహిళలు కనిపిస్తారు. ఆమె రాసిన నాలుగు నవలలు, ఒక కథా సంపుటి పరిచయమే ఇది. నవలల పోటీల్లో అనిల్‌ అవార్డు అందుకున్న ‘అమ్మ బంగారు కల’ సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధికి గురైన కూతురును తీర్చిదిద్దిన ఓ స్ర్తీ విజయగాథ. వైకల్యంతో పుట్టిన కూతుర్ని తిరస్కరించి రెండో వివాహం చేసుకున్న శాడిస్టుభర్తకు దూరంగా బతికి కూతురు జీవితాన్ని తార్చిదిద్దిన తల్లిగా అరవిందలో భారతీయ తాత్వికత, మూర్తీభవించిన తెలుగుదనం కనిపిస్తుంది. 

ఆమె మరో నవల ‘కోరుకున్న గమ్యం’. ఈ కథలో ప్రధాన పాత్ర కార్తీక తనకోసం తను బతకాలనుకున్న ఓ స్ర్తీ కథ ఈ నవల. తన ఇష్టం లేకుండానే జరిగిన పెళ్ళి, సంసారంలో ఉన్న డొల్లతనం, ఎంత ఆశగా ఎదురుచూసినా తన సంసారం బాగుపడకపోవడంతో జీవితాన్ని ఎక్కడినుంచైనా ప్రారంభించవ్చనే ధీమాతో యాభైఏళ్ళ వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కార్తీక ఏం సాధించింది? ఎంత గొప్పస్థానాన్ని పొందింది? అనేదే నవల. మరో నవల ‘ఆడదంటే....? సబల’ స్ర్తీ కి స్ర్తీయే శత్రువు అంటారు. కానీ ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడే తన భర్త భరతం పట్టేందుకు, అన్యాయానికి గురైన మధురిమ అనే స్ర్తీకి సహకరించిన ఇల్లాలిపాత్ర ఇందులో మనకు కనిపిస్తుంది. అమాయకులైన ఆడపిల్లలు మగవాడి నైజాన్ని పసిగట్టేందుకు ఉపయోగపడే నవల ఇది. మరో నవల ‘మాతృ సదనం’. సజీవ పాత్రల అనుభవాలను  పొందుపరచిన నవల ఇది.

ఈ నవలలో ప్రణతి పాత్ర అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. నాణేనికి రెండువైపులా చూపించిన నవలిది. అదేవిధంగా పదిహేను కథల సమాహారం ‘అమ్మతనం’ సంపుటి. ఇవన్నీ పలుచోట్ల ప్రచురితమైనవే. ఇందులో టైటిల్‌ కథ పిల్లలందరికీ ఒక గుణపాఠం చెప్పే కథ. అమ్మ హృదయాన్ని నిక్షిప్లంచేసిన ఒక అమ్మ రాసిన లేఖ ఈ కథ. ఇలా హృదయాలను తడిమి, ఆర్ర్దపరచి స్ర్తీ ఉన్నతతత్వాన్ని చాటే కథలివన్నీ.