మరణించని సంగీతం

అరుణ్‌ సాగర్‌ - ఈ పేరు వినగానే పుట్టుకతోనే ‘డెనిమ్‌’ ధరించి పుట్టాడా అనిపించే అత్యాధునికుడు గుర్తొస్తాడు. అటు జర్నలిజంలో, ఇటు సాహిత్యంలో కొత్త ట్రెండ్‌ ప్రవేశ పెట్టిన అరుదైన జర్నలిస్ట్‌, అర్బన్‌ పోయట్‌ కళ్లముందు ఫ్లాష్‌ అవుతాడు. ఆ అక్షరాల వెంట కళ్లు పరుగులు తీస్తుంటే, హార్ట్‌ బీట్‌ సర్రున పెంచుతూ వడివడిగా దూకే జలపాతం లాంటి శైలికి, సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే వాక్యనిర్మాణానికి, పద ప్రయోగాలకు, అలజడికి గురిచేసే భావజాలానికి ఫిదా అయిన వారెందరో. ‘నా కవిత్వమంతా నా ఇన్స్పిరేషన్‌ .. నా, నా స్నేహితుల జీవితాల అనుభవాల రిఫ్లెక్షన్‌, స్పాంటేనియస్‌ రియాక్షన్‌’ అని చెప్పే అరుణ్‌ కవిత్వం ఎన్ని కొత్త పుంతలు తొక్కిందో, వచనం అంతకంటే వినూత్నంగా సాగుతుంది. సొంత వేదన నుంచి సామూహికవేదన పలికేదాకా ప్రయాణించిన అరుణ్‌ సాగర్‌ ఇంకొంత కాలం ఉండి ఉంటే తెలుగు కవిత్వంలో ఇంకెన్ని విప్లవాత్మక మార్పులు వచ్చి ఉండేవో! ముతక వాసన కొట్టే భావాలకు, పండిపోయిన పద ప్రయోగాలకు ప్రత్యామ్నాయాలెన్ని చూపేవాడో అనిపిస్తాడు.

 

ఇఫ్పుడు అరుణ్‌ సాగర్‌ ముద్రితాలు, అముద్రితాలు, సోషల్‌ సైట్స్‌లో షేర్‌ చేసిన ఆర్టికల్స్‌, కవితలు ... ఆయన రచనలన్నీ ఒకదగ్గర కూర్చి ప్రచురించారు. సాహితీ మిత్రులు విశ్వేశ్వరరావు, అరుణ్‌ సోదరుడు జగన్‌ ఈ సంకలనాన్ని తీసుకొచ్చారు. తండ్రీ నిన్ను దలంచి... అని మొదలయ్యే ఈ గ్రంథం ఎక్స్‌ టిన్షన్‌ ప్రమాదంలో పడిన ఆదిమ జాతులు, వాటి సంస్కృతుల గురించి ఆర్ద్రంగా రాసిన దోడతిత్తివా అనే రైటప్‌ వరకు ... అరుణ్‌ సాగర్‌ అనే అక్షర సంద్రాన్ని, ఒడ్డున రాళ్లను వేగంగా తాకే కెరటాల్లాంటి అతని సృజనను పాఠకుల ముందుకు తెచ్చింది. 416 పేజీల ఈ పుస్తకం అరుణ్‌ అభిమానులకే కాదు, కవిత్వాన్ని ఇష్టంగా అనుసరించే పాఠకులకూ, అత్యాధునిక తెలుగు వచనాన్ని ఆరాధించే సాహితీ ప్రేమికులకూ ఓ మంచి కానుక అని చెప్పొచ్చు. కవి ప్రసాదమూర్తి అన్నట్టు ఇప్పటిదాకా అరుణ్‌ అక్షరాల్లోకి దిగని వారు ఇకనైనా ధైర్యం చేస్తే వేర్‌ వర్‌ యూ ఆల్‌ మై లైఫ్‌ అని కన్నీరుమున్నీరు అవడం ఖాయం.
- కిరణ్‌ చర్ల


అరుణ్‌ సాగర్‌ - అక్షర శ్వాస
పేజీలు : 416, వెల : రూ. 350
ప్రతులకు : సాహితీ మిత్రులు, 94906 34849