చరిత్ర... కొందరికి నచ్చుతుంది... మరికొందరికి కంటగింపు. ఉన్నది ఉన్నట్లు భారత దేశ చరిత్రను భారతీయుల ముందు ఉంచిన వ్యక్తులు చాలా అరుదు. ఒక వేళ ఉన్నది ఉన్నట్లు ఉంచడానికి ప్రయత్నించినా, ‘కొన్ని శక్తులు’ ఉండబట్టలేక వారిని నిస్సిగ్గుగా వెనక్కి లాగేస్తారు. వెనక్కి లాగడమే కాదు.. వారికి నచ్చిన రీతిలో ‘ఆస్థాని’చే ఏక బిగిన రాయించుకొని సమాజం మీద రుద్దుతుంటారు. ఆ ‘ఆస్థాన చరిత్ర’ అసలు చరిత్ర అయి కూర్చుంటుంది. ఈ క్షణం వరకూ దాదాపు అలా జరిగిందే అధికం. పాలకులు ‘చరిత్ర నిర్మాణం’లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చొరబడి వారి ‘రంగు’ను పూసేస్తారు, లేదా పూయిస్తారు. ఈ తరానికైతే మన దేశ చరిత్రను తెలుసుకోవడం మహా గగనమైకూర్చుంది. ఇలాంటి ‘రంగులు పూసే’ సమయంలో ‘అసలు రంగే’దో ఈ జాతికి విడమర్చి చెప్పడంలో సీనియర్ పాత్రికేయులు, పరిశోధకులు ఎం.వి.ఆర్.శాస్త్రి అగ్రగణ్యులు. దేశ చరిత్ర ఏది? అని ప్రశ్నలు వేయడమే కాకుండా, ‘ఇదీ చరిత్ర’ అంటూ ఈ జాతికి వాస్తవాలను అందించారు. అంతేకాకుండా ‘అసలు మహాత్ముడె’వరు?, ‘ఉన్నమాట’, ‘వీక్ పాయింట్’ ద్వారా పలు సందర్భాలలో కీలకమైన చారిత్రక అంశాలను అందించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక వ్యక్తులై ప్రచారం కోసం ఏమాత్రం పాకులాడక భరతమాత సేవలో తరించిన భగత్ సింగ్, అల్లూరి గూర్చి ఇప్పటికే పుస్తకాలు అందించారు ఎమ్వీఆర్. తాజాగా ‘సుభాస్ చంద్రబోస్’ అనే అపర దేశభక్తుడి గూర్చి కూలంకషంగా వివరిస్తూ ఈ రచనను వెలువరించారు.