నవ్య వీక్లీలో మౌనరాగాలు, అన్వేషణ, మౌనరాగాలు, అనుష్కడైరీ నవలలు సహా ఎన్నో కథలు కూడా రాసిన పేరెన్నికగన్న రచయిత సలీం. ఆయన రచనలకు లెక్కకు మిక్కిలిగా అభిమానులున్నారు. నవ్య వారపత్రికలో ఆయన రాసిన నవలలకు పాఠకులనుంచి ఎంతో మంచి స్పందన లభించింది. అలా ఆకట్టుకున్న మరో నవల ‘ఎడారిపూలు’ ఇప్పుడు పుస్తకరూపంలో మార్కెట్‌లోకొచ్చింది.

హైదరాబాద్‌ పాతబస్తీలోని మొగల్‌పురాలో ఉన్న ఒక ఇరుకుగల్లీలో ప్రారంభమైన ఈ నవలలో ముక్కుపచ్చలారని పదిహేనేళ్ళప్రాయంలో ఉన్న జుబేదా, రెహనాల జీవితాలు సముద్రాలుదాటివెళ్ళి ప్రత్యక్ష నరకం చవిచూసి అత్యంత విషాదకరంగా ముగుస్తాయి. 

పేద ముస్లిం కుటుంబల్లో స్ర్తీల వాక్‌స్వాతంత్ర్యలేమి, కనీసభద్రతాలేమి, నిస్సహాయస్థితి, అణచివేతలను ఈ నవలలో కళ్ళకట్టారు రచయిత. అందమైన పేద ఆడపిల్లల్ని వివాహం పేరుతో తీసుకువెళ్ళి అంగడిబొమ్మలుగా మార్చే దుర్మార్గచేష్టలు, మతం, కట్టుబాట్లపేరుతో వారిని గుడ్డిగా సమర్థించే అక్కడి ప్రభుత్వాలు, చట్టాలు, కనీస మానవత్వం, మానవహక్కులకు తావులేని దుర్మార్గపూరితమైన స్వార్థం, చట్టానికి దొరకని అణచివేత ధోరణి....ఇలా ఎన్నో కోణాలు ఈ నవలలో కనిపిస్తాయి. ఈ సీరియల్ చదివిన పాఠకులెందరో కంటనీరుపెట్టుకున్నారు. నవల చదివాక పాఠకులు లోతైన సామాజిక ఆలోచనల్లో పడతారు. చదువరిని వదలకుండా వెంటాడే నవలిది. 

 

ఎడారిపూలు
సలీం
ధర 150 రూపాయలు
పేజీలు 212
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు 
పాఠకుణ్ణి వెంటాడే నవల