హైదరాబాద్‌పై మరో కోణం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో తరుచూ చర్చకు వచ్చిన అంశాల్లో ‘భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం’ ఒకటి. ఈ చారిత్రక ఘటనపై వేరువేరు రకాల అవగాహనలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. కొందరు దానిని విమోచనగా భావిస్తే మరికొందరు హైదరాబాద్‌ సంస్థానం స్వాతంత్ర్యాన్ని హరించిన విషాద ఘటనగా ఇప్పటికీ నమ్ముతారు. విలీనానికి దారి తీసిన పరిస్థితులు, విలీన సమయానికి హైదరాబాద్‌ సంస్థానంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులపై బోలెడు పుస్తకాలు వచ్చాయి. వీటకి భిన్నమైనది మీర్‌ లాయక్‌ అలీ రాసిన ‘హైదరాబాద్‌ విషాదం’. ఇది ఆయన ఇంగ్లీష్‌లో రాసిన ‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’కు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి తెలుగు అనువాదం. 1947 డిసెంబర్‌ నుంచి 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌ వశమయ్యేవరకు లాయక్‌ అలీ సంస్థానం ప్రఽధాన మంత్రిగా, ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు సన్నిహితునిగా కొనసాగారు. హైదరాబాద్‌ స్వతంత్ర సంస్థానంగా కొనసాగాలని బలంగా కాంక్షించి అందుకోసం తీవ్రంగా ప్రయత్నించిన వారిలో లాయక్‌ అలీ ఒకరు. స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరుపోరాటంగా నిజాం చేసిన ప్రయత్నాలు, ఈ ప్రయత్నాలు విఫలం కావడానికి కారణమైన పరిస్థితులు, ఈ పరిస్థితులను ప్రభావితం చేసిన అంశాలు, తెరపైన పాత్రలు, తెరవెనక పాత్రదారులు.. వీటన్నిటిపై ఒక ప్రత్యక్ష సాక్షి కథనమే ఈ ‘హైదరాబాద్‌ విషాదం’. భారతకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పోలీస్‌ యాక్షన్‌ వరకు సరిగ్గా 13 నెలల పాటు నిజాం రాజప్రాసాదం కేంద్రంగా చోటు చేసుకున్న ఉద్విగ్న పరిణామాల సమాహారం ఈ పుస్తకం. ఇందులో మొత్తం 34 అధ్యాయాలున్నాయి. ఆఖరులో రచయిత గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని పాకిస్తాన్‌కు వెళ్ళిపోయిన వైనాన్ని కూడా అనుబంధంగా చేర్చారు. లాయక్‌ అలీ సంపన్న వ్యాపారవేత్త. హైదరాబాద్‌ ప్రధాని పదవి చేపట్టక ముందు ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రతినిధిగా ఉన్నారు. లాయక్‌ అలీ కుటుంబ నేపథ్యం, ఆయన విధేయతల వల్ల కొన్ని విషయాల్లో నిష్పాక్షికత లోపించినట్టు కనిపించవచ్చు. అయితే, ఈ పుస్తకాన్ని ఎంతవరకు ఆబ్జెక్టివ్‌గా రాశారన్న చర్చ కంటే నాటి చరిత్రను మరో దృక్కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్న దృష్టితో చదవడం మంచిది.

- వి. శ్రీనివాస్‌

హైదరాబాద్‌ విషాదం, మీర్‌ లాయక్‌ అలీ, తెలుగు: డా. ఏనుగు నరసింహారెడ్డి

పేజీలు : 320, వెల : రూ.150, ప్రతులకు : పాలపిట్ట బుక్స్‌, హైదరాబాద్‌ 040-27678430