వర్తమాన జీవన చక్రాలు

సమకాలీన సమాజాన్ని బహుముఖ కోణాల్లో పట్టుకున్న  రచయిత జగన్నాథశర్మ. ఆయన ‘నవ్య వీక్లీ’లో సింగిల్‌ పేజీ కథల రూపంలో అనేక జీవన సత్యాలను ఆవిష్కరించారు. అందులోంచి వంద కథలను ఎంపిక చేసి ‘జగన్నాథ కథచక్రాల్‌’ పేరిట వెలువరించారు. ‘దేవుడిడ్లీ’, ‘అమ్మ చెప్పిన ఎనిమిది అబద్థాలు’, ‘చూనునా!’, ‘గాలిపటం’, ‘స్మైల్‌ ప్లీజ్‌’, ‘తాతాజీ ఆటలు’, ‘విమర్శని తట్టుకో! విజయం నీదే!’, ‘చిన్నబుర్ర అప్పన్న’, ‘భగవద్గీత’... ప్రతికథా బతుకుపరుగులో పడిపోయి మర్చిపోయిన బాల్యకౌమారాల్ని మనకు గుర్తుచేస్తుంది. కొన్ని కథల్లో బాబాయ్‌లా ఆప్యాయంగా పలకరించి సమస్యల పరిష్కారానికి దిక్సూచిలా నిలుస్తారు. ‘ప్రతి సమస్యా ఓ కానుకే! అదే సత్యం! జీవిత సత్యం!’ అంటూ మనిషి రోజూ గుడ్‌ మూడ్‌నే ఎన్నుకోవాలని చెబుతారు జగన్నాథశర్మ. ‘కొనుక్కుని ఆనందించేందుకు అనుభూతుల్ని ఎవరూ అమ్మరు. ఎవరికి వారు వాటిని సాధించుకోవాల్సిందే’ అని జీవన సౌందర్యాన్ని తెలియజేస్తారు. ‘భాషనయినా, మనిషినయినా ముందు ప్రేమించాలి. తర్వాతే ఫలితాన్ని ఆశించాలి’ అని ప్రేమలోని మార్మికతనూ విప్పుతారు.

- ఎ. రవీంద్రబాబు


జగన్నాథ కథచక్రాల్‌ (కథలు)

రచన: జగన్నాథశర్మ 

పేజీలు: 208, 

వెల: రూ. 108 

ప్రతులకు: 98491 81712