దళిత ఉద్యమ పెద్ద బాలశిక్ష

భారత రాజకీయ చరిత్రలో దళిత పోరాటాల స్థానం విస్తృతమైనది. తెలుగునాట సైతం రాజకీయాలనే కాక సాంస్కృతిక, సాహిత్య రంగాలతో సహా విభిన్న కోణాల్లో దళిత ఉద్యమాలు ఎంతో ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో 1985 కారం చేడు నుంచి లక్షింపేట దాడి వరకూ దళితులపై అణచివేత, దమనకాండలను నిరసిస్తూ అనేక వ్యాసాలు, స్పందనలు వచ్చాయి. వాటన్నింటిని కుల వ్యవస్థ - దళిత సమస్య పేరుతో సంకలనం తెచ్చారు పాపని నాగరాజు. గతంలో ఇదే రచయిత తీసుకువచ్చిన కులవ్యవస్థ - బిసి సమస్య అనే సంకలనానికి కొనసాగింపుగా ఈ రెండో భాగం వెలువరించారు. గత నలభై ఏళ్లలో (1983 నుంచి 2019 దాకా) దళిత సమస్య, దాడులు, ఉద్యమాలపై రిపోర్టులు, విశ్లేషణలతో పాటూ వివిధ సమీక్షలు, చర్చలను ఈ సంకలనంలో పొందుపర్చారు. దళిత ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారికి, పరిశోధకులకు ఈ గ్రంథం ఉపకరిస్తుంది. పుస్తకం ధర అందరికీ అందు బాటులో ఉంటే మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. కులమ అసమానత్వాల నిర్మూలన, సకల మానవ సమానత్వం కోరుతూ జరుగుతున్న పోరాటాలకు ఈ పుస్తకం పెద్ద బాలశిక్షలా నిలుస్తుంది.

- చందు తులసి

కుల వ్యవస్థ - దళిత సమస్య 
(దళిత ఉద్యమ చరిత్రపై సంకలనం)
సంపాదకులు: పాపని నాగరాజు
పేజీలు: 552, వెల: రూ. 1500(రెండు సంకలనాలు కలిపి)
ప్రతులకు: జాబాలి ప్రచురణలు, 99488 72190