నిధినిక్షేపాలకోసం మనుషులమధ్య పోరాటం, హింస మొదటినుంచీ ఉన్నదే. వాటికోసం చేసే అన్వేషణలన్నీ గొప్ప సాహసకార్యలే. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో సినిమాలుగా వచ్చాయి. ఈ చిత్రాలకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో సూపర్‌స్టార్‌ కృ‌ష్ణ యాభైఏళ్ళ క్రితమే హాలీవుడ్‌ స్థాయి సాంకేతిక విలువలతో తెలుగుతెరకెక్కించిన అలాంటి అద్భుతచిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’. దేశంలోనే తొలి కౌబోయ్‌ వర్ణచిత్రంగా, పలు భాషల్లో కలెక్షన్స్‌ ఢంకా మోగించింది. కృష్ణ వీరాభిమాని విజయ్‌ ఇప్పుడు ఈ సినిమాను నవలారూపంలోకి తీసుకొచ్చారు. అయితే నవలాప్రక్రియకు అనుగుణంగా కథాకథనంలో ప్రధానపాత్రల్లో మార్పులు చేర్పులు చేసి, ఆ హిస్టారికల్‌ కౌబాయ్‌ ఎడ్వెంచర్‌ను, హైటెక్నాలజీ గ్రాఫిక్స్‌ను తన శిల్పజ్ఞానంతో అక్షరాల్లోకూర్చి పాఠకుడికి దృశ్యమానం చేశారు. కృష్ణ సినిమాలోని ఆనాటి అపురూపమైన ఫోటోలు, విడుదలయ్యాక ఆ సినిమా చేసిన మిరకిల్స్‌, ఆనాటి ప్రముఖుల స్పందనలను పుస్తకం మధ్యమధ్యలో జతకూర్చి ఆనాటి–ఈనాటి పాఠకులతో ఆసాంతం నాన్‌స్టాప్‌గా చదివించేలా ఈ నవలను తీర్చిదిద్దారు. ఉత్కంఠ భరితమైన క్లైమాక్స్‌ ఘట్టాన్ని పాఠకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, పుస్తకాన్ని పక్కన పడేసే అవకాశం లేకుండా అద్భుతమైన గ్రాఫిక్స్‌ వర్ణనలతో కళ్ళకుకట్టారు.


మోసగాళ్ళకు మోసగాడు
హిస్టారికల్‌ కౌబాయ్‌ ఎడ్వెంచర్‌
రచన ఆరుద్ర రీమిక్స్‌ & డిజైన్‌ విజయ్‌
ధర 250 రూపాయలు
పేజీలు 302
ప్రతులకు విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవ తెలంగాణ బ్రాంచీలు
నవోదయ బుక్‌హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుగా, హైదరాబాద్‌–027