తెర వెనుక ఎమ్మెస్‌ జీవితం

సినిమా నటుడిగా ఎమ్మెస్‌ నారాయణ గ్లామర్‌నూ, క్రేజ్‌నూ కాసేపు పక్కనపెట్టి ఒక మధ్యతరగతి జీవిగా దర్శింపచేసిన పుస్తకం ఇది. ఆయన జీవన ప్రయాణంలో ఎన్నిరకాల పరిణామాత్మక, గుణాత్మక మార్పులకు లోనయ్యాడనే విషయాలను ఆసక్తికరంగా కొంచెం అసంపూర్ణంగా, మరికొంత విస్తారంగా వివరించే ఆత్మకథాత్మక సంభాషణం కూనపరాజు కుమార్‌ అక్షరీకరించిన ‘ఎమ్మెస్‌ నారాయణ జీవిత కథ’. కోట్ల రూపాయల పెట్టుబడులతో విస్తారమైన ప్రజా సమూహాన్ని నిత్యమూ ప్రభావితం చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి లోగడ మూడు దశాబ్దాలుగా గాసిప్స్‌ తప్ప ఆ రంగానికి చెందిన వ్యక్తుల కథలూ, గాథలూ పుస్తక రూపంలో రావడం ఎందుకో పూర్తిగా ఆగిపోయింది.

 ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ వెలువడిన ఈ పుస్తకం పాఠకులను హాయిగా చదివిస్తుంది. ఎమ్మెస్‌ బాల్యానుభవాల దగ్గరనుంచి సినిమా రచయితగా స్థిరపడాలనుకున్న ఎమ్మెస్‌ గొప్ప కమెడియన్‌గా మారేంతవరకూ ఆయన జీవితంలో సంభవించిన నాటకీయతను దశలవారీగా విశదీకరిస్తుంది. నవ్యలో సీరియలీకరించబడిన ఈ ఇరవై నాలుగు అధ్యాయాల జీవిత కథ ఎమ్మెస్‌ బహుముఖ వ్యక్తిత్వాన్ని పాఠకులకు పదునుగా, సూటిగా పరిచయం చేస్తుంది. కుమార్‌ రచనాశైలి, ప్రకాష్‌, గంగాధర్‌ ఎడిటింగ్‌ మూలంగా ఎమ్మెస్‌ స్వయంగా తానే పాఠకులకు కథ చెబుతున్న ఫీల్‌ సాధ్యమయ్యింది. ప్రసాదమూర్తి ఎమ్మెస్‌పై రాసిన కవితలు, ఎంతో శ్రమించి అనిల్‌ బత్తుల సేకరించిన ఎమ్మెస్‌ ఫిల్మోగ్రఫీ ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణలు. సాహితి ‘లక్ష్మి’ సహకారంతో వెలువరించిన ఎమ్మెస్‌ జీవిత కథ ఆయన అభిమానులనే కాదు సాధారణ పాఠకులనూ ప్రేక్షకులనూ విభ్రమంతో విడవకుండా చదివిస్తుంది.

ఎమ్మెస్‌ నారాయణ జీవిత కథ
కూనపరాజు కుమార్‌
పేజీలు : 208, 
వెల : రూ. 175
ప్రతులకు : 8121098500 0866-2436642/43