స్థానికత నుంచి సామూహికత వైపు

ఇవి అచ్చమైన పాణి కథలు. కర్నూలు కథలు. స్థానికత, కుటుంబం, సమాజం, రాజకీయం, విప్లవానికున్న బంధాన్ని బలంగా చూపించే కథలు. ఈ ‘నేరుడురంగు పిల్లవాడు’ సంపుటిలో పది కథలున్నాయి. ప్రతి కథ ఉద్వేగం, ఆలోచన, ఆర్ద్రతతో సాగుతుంది. నీటితో, మట్టితో పెనవేసుకున్న జీవితాలను వాస్తవికతతో విస్తృతపరుస్తున్నాయి. ‘రాజకుమారుడు - కార్పేటమ్మ’ కథ ప్రభుత్వం, కార్పొరేట్‌ శక్తుల మకిలితనాన్ని మ్యాజిక్‌ రియలిజంలో కడిగేస్తుంది. ‘నేరేడురంగు పిల్లవాడు’ కథ తాత్వికధోరణితో విప్లవ జ్ఞాపకంగా వెంటాడుతుంది. ‘ఔట్‌ ఫ్లో’ కన్నీళ్లకు, నీళ్లకు మధ్య నడిచే బతుకుల్ని ప్రాంతీయత నుంచి సామూహికంగా పరిచయం చేస్తుంది. ‘నదిపారని నేల’ వ్యక్తి నుంచి కుటుంబం, సమస్య నుంచి విప్లవం వరకూ ఉన్న రిలేషన్స్‌ను సూత్రీకరిస్తుంది. ‘శవాల ఖజానా’ అభివృద్ధిలోని వర్తమాన రాజకీయ లోతుల్ని తవ్వి తీస్తుంది. ‘నీడల జాడలు’ సమస్యల్ని, పోరాటాల్ని ప్రభుత్వం మతం రంగుతో నీరుగార్చడాన్ని ఎండగడుతుంది. అభాస, తడి, ఇన్‌ మోషన్‌, రీ కనెక్ట్‌... ప్రతి కథా సంక్లిష్ట సామాజిక సందర్భాల్లోని వాస్తవాలే. పాణి లోచూపులోంచి నడిచిన కథన శిల్పాలే. ‘మంచి చేయడానికి మన మంచితనమే సరిపోదు’, ‘జీవితం విలువ తెలియడం కంటే విలువైన సంపద ఏదీ లేదు’ లాంటి ఎన్నో వాక్యాలు కథల్లో అంతర్లీనమై మనల్ని కట్టిపడేస్తాయి. కర్నూలు మాండలిక సొబగులు, పాత్రలు, వాటి ఘర్షణలు, అక్కడక్కడా సునిశిత వ్యంగ్యం, రాయలసీమ సామాజిక చరిత్ర ఈ కథల్లో గతితర్కంతో ప్రవహిస్తున్నాయి.

- ఎ. రవీంద్రబాబు

నేరేడురంగు పిల్లవాడు (కథలు)

రచన: పాణి

పేజీలు: 159,

వెల: రూ. 150

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,

98661 29458