చలంపై వినూత్న నవల 

వ్యక్తి స్వేచ్ఛ, స్ర్తీస్వేచ్ఛ, ప్రేమలు, పెళ్లిళ్ల పట్ల గుడిపాటి వెంకట చ లానికి ఉన్న భావాలు విప్లవాత్మకమైనవి. ఆయన తదనంతర రచయితల ఆలోచనలనూ, మనోభావాలనూ సమూలంగా మార్చేసిన లేదా తీవ్రంగా ప్రభావితం చేసిన భావాలవి. నవలా రచనలో జీవితాత్మక నవల ఓ కొత్త ప్రయోగం. గతంలో ప్రముఖ ఆంగ్ల రచయిత ఇర్వింగ్‌ స్టోన మాత్రమే ఇటువంటి ప్రయోగం చేశారు. కొద్దిగా కల్పన ఉన్నప్పటికీ, అసలు సంఘటనలు, అసలు పాత్రలనే ఎంచుకుని ఈ నవలను రాశారు. తను రాసినట్టుగా కాకుండా, తన రచనలోనే ఉన్న సృజన అనే స్ర్తీ పాత్ర ఈ నవలను రచించినట్టు రచయిత కల్పన చేశారు. తన ఆశయాలు, ఆచరణ మధ్య చలం పడ్డ సంఘర్షణ ఆయన జీవితాన్ని ఎంతలా కల్లోల పరిచిందో ఇందులో చక్కగా చిత్రీకరించారు. చలం ‘ఆత్మకథ’ రాసుకున్నా చలం రాయని అనేక విషయాలు ఈ జీవితాత్మక నవలలో కనిపిస్తాయి. 

- జి. రాజశుక 


ప్రేమకు ఆవలి తీరం (చలం జీవితాత్మక నవల) 
అంపశయ్య నవీన్ 
పేజీలు: 235, వెల: రూ. 250 (20 డాలర్లు) 
ప్రతులకు : నవోదయ, నవ చేతన, విశాలాంధ్ర