బడుగుజీవుల వెతలకి సమాధానాలు

సామాజిక చైతన్యంతో, సమాజంలో కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయాల్ని, మోసాల్ని ప్రశ్నిస్తూ, కొన్నిటికి పరిష్కారాలు సూచిస్తూ, పాఠకుల గుండెలను తాకేలా రాసే కథల్లో జీవం ఉంటుంది. రాసే ప్రతీ కథ సమాజంలోని వాస్తవ పరిస్థితులకు దర్పణంగా ఉండటం కష్టసాధ్యమైన విషయం. అటువంటిదాన్ని సైతం సుసాధ్యం చేసారు జ్వలిత. ‘రూపాంతరం’ సంపుటిలోని 22 కథల్లోనూ ఏదో ఒక సామాజిక అంశం నిభిడీకృతమై ఉంది. బహుజన స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, పడుతున్న వెతల్ని భూమికగా తీసుకుని మలచిన తీరు ప్రశంసనీయం. గ్రామాల్లో నివసించే ప్రజల అమాయకత్వం, శ్రమైక జీవన సౌందర్యం ఈ కథల్లో అడుగడుగునా కనిపిస్తాయి. నానాటికీ కులవృత్తులు కనుమరుగైపోయి తెలంగాణ పల్లె బతుకులు ఎలా ఛిన్నాభిన్నమై కొత్త రూపాల్లోకి, వృత్తుల్లోకి ‘రూపాంతరం’ చెందుతున్నాయో ఈ కథలు చదివితే అర్థమవుతుంది. లింగ వివక్ష, వినియోగదారుల చైతన్యం, రాజకీయ నాయకుల మోసాలు .. ఇలా నేటి సమాజానికి అవసరమైన, రాయదగిన ప్రతీ అంశాన్ని కథగా మలిచారు. కొన్ని కథల్ని కేవలం సమాచారాన్ని అందించడం కోసమే రాయడం గమనార్హం.

 

 - గొడవర్తి శ్రీనివాసు

రూపాంతరం (జ్వలిత కథలు)
పేజీలు : 162, వెల : రూ. 200, ప్రతులకు: 99891 98943