ఆ ఇద్దరూ చెప్పడంతోనాగేశ్వరరావుగారు మనసు మార్చుకున్నారు

ప్రతీ మనిషి జీవితంలోనూ మరపురాని అనుభూతులు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఎప్పటికీ చెప్పుకునే అత్యుత్తమమైన అనుభూతులు మరికొన్ని!! కోదండరామిరెడ్డిగారు కూడా దర్శకునిగా తన కెరీర్‌లో అలాంటి గొప్ప అనుభూతుల్ని సంపాదించుకున్నారు. అవేంటంటే..

‘గోపాలకృష్ణుడు’ సినిమా విడుదలైన కొన్ని నెలలకు ఓ రోజు నాగేశ్వరావుగారు ఫోన్‌ చేశారు.ఆయన నాతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే కొంత టెన్షన్‌ ఫీలై, ‘‘నమస్తే.. చెప్పండి సార్‌’’ అన్నాను.‘‘రెడ్డిగారూ, అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌ మీద ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. అందులో నేనే హీరోగా నటిస్తాను. మీరు డైరెక్ట్‌ చేయాలి’’ అన్నారు సూటిగా అసలు విషయానికి వస్తూ.ఆ మాట వినగానే నాకు ఆనందంతో చిందులు వేయాలనిపించింది. నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారి సొంత సినిమాకు నేను దర్శకత్వం వహించడమా...వాటే గ్రేట్‌ ఆఫర్‌!ఆ ఆనందాన్ని అణచుకుని, ‘‘తప్పకుండా సార్‌.. నేను మీ అభిమానిని. మీ సొంత బ్యానర్‌లో సినిమా చేయడం నిజంగా నాకు ఓ క్రెడిట్‌. ‘గోపాలకృష్ణుడు’తో మీకు హిట్‌ ఇవ్వలేకపోయాను. ఈ సారి తప్పకుండా హిట్‌ సినిమా చేద్దాం సార్‌’’ అన్నాను.

ఆయన నవ్వేసి ‘కథ ఎంపిక బాధ్యత కూడా మీదే’ అని చెప్పేసి ఫోన్‌ పెట్టేశారు.కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే నేను మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో చూసిన తమిళ సినిమాల్లో రెండు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ రెండు చిత్రాల్లోనూ శివాజీగణేశన్‌గారే హీరో! నేను ఎప్పటికైనా దర్శకుణ్ణయితే, ఆ రెండు సినిమాల్ని నాగేశ్వరరావుగారితో రీమేక్‌ చేయాలని అప్పుడే గట్టిగా అనుకున్నాను.‘గోపాలకృష్ణుడు’ కు కుదరలేదు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్‌ వదులుకోదలుచుకోలేదు.ఆ రెండు చిత్రాల్లో ‘ఊటీ వరై వురువు’ (1967). పూర్తి వినోదభరిత చిత్రం. ‘నాగేశ్వరరావుగారితో తెలుగులో అదిరిపోతుంది’ అనుకున్నాను.

నాగేశ్వరరావుగారు ఫోన్‌ చేసిన అరగంట తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆంజనేయ చౌదరి లైన్‌లోకి వచ్చాడు. ‘ఊటీ వరై వురువు’ సినిమా చూసి చాలా ఏళ్లయింది కనుక మళ్లీ ఓ సారి చూడాలనుకుని, ప్రొజెక్షన్‌ ఏర్పాటు చెయ్యమని చెప్పాను. నేను ఒక్కడినే కూర్చుని ఆ సినిమా చూశాను.ఆ సినిమాలో శివాజీగణేశన్‌ పాత్రకు ప్రాధాన్యం తగ్గించారు. కమిడియన్లు నాగేశ్‌, బాలయ్య, రామస్వామి తదితరులు డామినెట్‌ చేశారు. కానీ కథలో మంచి ట్విస్ట్‌ ఉంది. కమెడియన్ల డామినేషన్‌ వల్ల అసలు కథ మరుగున పడింది. కమెడియన్ల పాత్రలు తగ్గించి అసలు కథ రక్తి కట్టేట్టు నడపవచ్చని అనిపించింది.