వాణిశ్రీ,బాలకృష్ణలతోతీద్దాం అనుకున్నా

బాలకృష్ణ, వాణిశ్రీ జంట అనుకున్నాను.సినిమా సెకండాఫ్‌లో ఆ కుర్రాడు పెరిగి పెద్దవుతాడు. హీరోయిన్‌, అతని మధ్య సీన్లు చాలా బాగుంటాయి. ఆ పాత్రకు బాలకృష్ణను అనుకున్నాను. ఆయన నటించిన ‘అన్నదమ్ముల అనుబంధం’ విడుదలైంది. 17ఏళ్లు ఉంటాయేమో. నా పాత్రకు సరిగ్గా సరిపోతాడు. హీరోయిన్‌ పాత్రకు వాణిశ్రీ అయితే బాగుంటుందనుకున్నాను. మా నిర్మాతలకు అదే విషయం చెప్పాను. ఈ కాంబినేషన్‌ అనగానే వాళ్లిద్గరూ భయపడ్డారు. ‘‘మేం కొత్తవాళ్లం సార్‌..వాళ్లని తీసుకురాలేం, మా వల్ల కాదు’’ అన్నారు...పోనీ కొత్త వాళ్లతో తీద్దామన్నాను. కొత్త వాళ్లయితే బిజినెస్‌ కాదు, ప్రేక్షకులు థియేటర్‌కు రారు అన్నారు. చివరకు కొత్త, పాత తారలతో సినిమా తీద్దామని డిసైడ్‌ చేశాం.అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన మాధవిని హీరోయిన్‌ పాత్రకు ఎంపిక చేశారు. ఆమెను ప్రేమించే డాక్టర్‌ పాత్రకు శరత్‌బాబును ఎన్నుకొన్నాం. హీరో కొత్తవాడైతే బాగుంటుందనుకున్నాం.

అప్పుడు నా స్నేహితుడు పరంధామరెడ్డి రాజేంద్రప్రసాద్‌ గురించి చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్‌ అయ్యాడని విని పిలిపించాం. ఆ రోజుల్లో సన్నగా, పీలగా ఉండేవారు రాజేంద్రప్రసాద్‌. అందగాడు కాదు. బాగా చేశాడు. మా సినిమాతో అతనికి గుర్తింపు వచ్చింది.సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు అందంగా ఉండే కొత్త అమ్మాయిని ఎంపికచేయాలనుకున్నాను. అయితే మా నిర్మాతలు విజయకళ అనే అమ్మాయిని తెచ్చి ఈమె సెకండ్‌ హీరోయిన్‌ అన్నారు. నా కెరీర్‌లో కాంప్రమైజ్‌ కావడమన్నది ఆ అమ్మాయితోనే మొదలైంది. ఎందుకో ఆమె నాకు నచ్చకపోవడంతో ‘‘వద్దండీ’’ అన్నాను.‘‘లేదండీ. మనకు తెలిసిన అమ్మాయి. అబ్లిగేషన్‌’ అనేసరికి కాదనలేకపోయా.అప్పలాచార్య మాటలు రాశారు. సత్యం సంగీత దర్శకుడు.నవంబర్‌ 29, 1979... నా కెరీర్‌ కొత్త మలుపు తిరిగిన రోజు. ఎందుకంటే ఆ రోజున ‘మూడుముళ్ల బంధం’ చిత్రం షూటింగ్‌ రాజమండ్రిలో మొదలైంది. 30 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమా తీశాం.

క్లైమాక్స్‌ మార్చాం

తొలి కాపీ వచ్చిన తర్వాత ‘మూడుముళ్ల బంధం’ చిత్రాన్ని కొంతమంది శ్రేయోభిలాషులకు చూపించాం. ముగింపులో హీరో ఇద్దరు హీరోయిన్లని పెళ్ళి చేసుకున్నట్లు తీశాం. చిన్నప్పుడు తను తెలియకుండానే తాళి కట్టిన యువతిని, పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమించిన యువతిని అతను పెళ్ళి చేసుకుంటాడు. అది చూసి పెద్దలు గగ్గోలు పెట్టారు. (‘ఏమిటయ్యా బాబూ.. నువ్వు మరీ అడ్వాన్స్‌డ్‌ సినిమా తీశావు’’ అని కోపడ్డారు. ‘‘తొందరపడి కోయిల ముందే కూసింది’’ అని కూడా అన్నారు.దర్శకునిగా నాకు అది తొలి సినిమా. నిర్మాతలకూ అదే మొదటి సినిమా.అందుకే అనుభవమున్నవాళ్లు చెప్పడంతో ‘నిజమే కామోసు’ అనుకుని ముగింపు మార్చాను. హీరోని, సెకండ్‌ హీరోయిన్‌ను కలిపి, మెయిన్‌ హీరోయిన్‌ చనిపోయినట్లు రీ షూట్‌ చేశాం.