మేం చెప్పిన మాట‌లు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యాయి. ఎన్టీఆర్‌గారికి జ‌రిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకున్నారు. నెల‌రోజులయ్యేస‌రికి ఊహించ‌న‌టువంటి రెవ‌ల్యూష‌న్ వ‌చ్చేసింది. ఎప్పుడూ బ‌య‌ట‌కురాని మ‌హిళ‌లు కూడా బ‌య‌టకు వ‌చ్చేసి, ‘మేం ఇక ఇంట్లో వంట‌లు కూడా చేయం. మేం ఇక్క‌డే ఉంటాం.అని న‌డిరోడ్డుకు చేరుకున్నారు. అక్క‌డే వంట‌లు చేశారు. మ‌ళ్లీ ఆయ‌న గ‌ద్దె ఎక్కేవ‌ర‌కు ఊరుకోం’ అని తెగేసి చెప్పేశారు. నెలరోజులు తిర‌క్కుండానే మ‌ర‌లా ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం నిజంగా గ్రేట్‌. నెలరోజులముందు నా మాన‌సిక ప‌రిస్థితికి, ఇప్ప‌టికి చాలా తేడా వ‌చ్చేసింది. మంచి ప‌నిచేశాన‌నే ఆనందం నాలో క‌లిగింది. చెన్నైలో ఒక‌రోజు కుటుంబ‌స‌భ్యులతో ఉంటే అన్న‌గారినుంచి ఫోన్ వ‌చ్చింది.

వెంట‌నే హైద‌రాబాద్‌లో వాలిపోయాను. అప్పుడు అన్న‌గారు అభినందించారు. ‘అయినా నేనేం చేశాన‌ని మీరు ఇంత‌గా అభినందిస్తున్నారు. మాకు మీరు ముఖ్యమండీ. మీ కోసం ఏమైనా చేస్తాను. రాజ‌కీయాల్లోకి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వ‌స్తానండీ. మీ నోటిమాట‌ నేను కాద‌న‌ను. నేనే కాదు, మ‌న‌వాళ్ళెవ‌రూ కాద‌నరు. అంద‌రం మీ మాట శిర‌సావ‌హిస్తాం. పార్టీకి సంబంధించిన ప్ర‌చారం విష‌యంలోనైనా, మ‌రేవిష‌యంలోనైనా, పాట‌ల రికార్డింగ్ వంటివాటిలో కూడా ముందుంటాం’ అన్నా. మ‌ర‌లా మ‌ద్రాసుకు వెళ్లిపోయాను. నా బిజీలో నేను ప‌డ్డా. నేనే కాదు, నిజంగా పార్టీ పాట‌లరికార్డింగ్ విష‌యంలో రాఘ‌వేంద్ర‌రావుగారు, మ్యూజిక్ డైరెక్టర్ చ‌క్ర‌వ‌ర్తిగారు కూడా చాలా హెల్ప్ చేసేవారు.

సార్‌! సీఎం మాట్లాడుతారు

ఒక‌రోజు ఉద‌యాన్నే నేను టిఫిన్ తింటున్నా. ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. నేనే రిజీవ‌ర్ తీసి ‘హ‌లో’ అన్నాను. ‘సార్‌...సీఎంగారు మాట్లాడుతారు’ అన్నారు అవ‌త‌లివైపు నుంచి. ‘స‌రే ఇవ్వండి’ అన్నా. అంత‌లోనే ‘హ‌లో.. బ్ర‌ద‌ర్‌’ అన్నారు ఎన్టీఆర్‌గారూ. ‘అన్న‌గారూ.. ఏంటండీ’ అన్నాను. ‘బ్ర‌ద‌ర్‌, రాజ‌మండ్రినుంచి ఎంపీ సీటుకి పోటీ చేయాలి మీరు’ అన్నారు. నేను షాక్‌. ‘అదేంటి అన్న‌గారూ, నేనేంటి? పోటీ ఏంటి? ఎంపీ ఏంటి?’ అన్నా. ‘లేదు బ్ర‌ద‌ర్‌. అక్క‌డ మీరైతేనే బావుంటుంది. అక్క‌డ రెండు గ్రూపులైపోయారు. మీకు ఇస్తే కాంప్ర‌మైజ్ అవుతామ‌ని ఆ రెండు గ్రూపులవారూ అంటున్నారు. మీరు కూడా పార్టీకి చాలా కృషి చేశారు. అందుకే మీరైతే క‌రెక్ట్ అని మిమ్మ‌ల్ని ఎంపిక చేశాం’ అని చెప్పారు.‘సార్‌..నాకు నాలుగు రోజులు టైమ్ ఇవ్వండి సార్‌. నేను ఆలోచించుకుని చెబుతాను. ఇప్ప‌టికిప్పుడు ఏమీ నిర్ణ‌యించుకోలేక‌పోతున్నాను.