సుప్రసిద్ధ కవి, కథకుడు, అనువాదకుడు, సినీ విశ్లేషకుడు, వ్యాస రచయిత వారాల ఆనంద్‌. సమాంతర చిత్రాల ఉద్యమకర్త, ఈ తరం పిల్లల్లో సాటి మనిషిని ప్రేమించే కళాత్మక స్పృహ పెంపొందించేందుకు ఉత్తమ చిత్రాలు, ఉత్తమ సాహిత్యం దోహదం చేస్తాయంటున్న ఆయన ఇంటర్వ్యూ....

వారాల ఆనంద్‌  తండ్రి అంజయ్య. విశ్రాంత ఉపాధ్యాయులు. తల్లి రాధ. కరీంనగర్‌ వాస్తవ్యులు. ఆనంద్‌ నాయనమ్మగారు సత్తెమ్మ. కరీంనగర్‌లో మిఠాయి సత్తెమ్మగా ప్రసిద్ధి.  1958ఆగస్టు 21న వేములవాడలో జన్మించిన ఆనంద్‌, ముగ్గురు పెదనాన్నలు, వారి పిల్లలమధ్య ఉమ్మడి కుటుంబంలో పెరిగారు.  బిఎస్సీ బయాలజీ చదివి ఉస్మానియా క్యాంపస్‌లో లైబ్రరీ సైన్స్‌ చదివారు. దాంతోపాటు ఎం.ఎ తెలుగు, ఎం.ఎ ఫిలాసఫీ చేశారు. కరీంనగర్‌జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలల్లో 36ఏళ్ళు (1980–2016) గ్రంథపాలకునిగా పనిచేశారు.  ఆనంద్‌ మొదట డిటెక్టివ్‌ నవలలు బాగా చదివేవారు. తర్వాత మేనమామగారింటి లైబ్రరీలో సుప్రసిద్ధ రచయితల నవలలు చదువుకున్నారు. అసమర్ధుని జీవయాత్ర, చివరకు మిగిలేది, కాలాతీతవ్యక్తులు, అంపశయ్య..లాంటి నవలలతోపాటు శ్రీశ్రీ కవిత్వం చదివి ప్రగతిశీల ఉద్యమ ప్రభావానికి గురయ్యారు. కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడు, తన మేనమామ–రచయిత జింబోతో కలిసి తమ కళాశాల అధ్యాపకుడు అంపశయ్య నవీన్ దగ్గర ఎన్నో సాహిత్యవిషయాలు తెలుసుకునేవారు.

1976లో వేములవాడలో ‘కళానికేతన్‌ సంస్థ వేదికగా జరిగే సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సాహిత్య ప్రపంచాన్ని విస్తరించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీవితం ఆయన వ్యక్తిత్వాన్ని, అభిరుచులను తీర్చిదిద్దింది. నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిగం కృష్ణారావులాంటి సాహితీమిత్రులతో ‘ఉస్మానియా రైటర్స్‌ సర్కిల్‌ స్థాపించారు. అప్పటినుంచే ఆయన పత్రికల్లో కథలు, కవిత్వం రాసేవారు. ఇప్పటికీ అన్ని పత్రికల్లోనూ కవితలు, కథలు రాస్తున్నారు ఆనంద్‌.

***********************
కవిత్వం, సాహిత్యవ్యాసాలు
ఆనంద్‌ మొదట కథలు రాసేవారు. తర్వాత మెల్లిగా కవిత్వంవైపు మళ్ళారు. సాహితీ మిత్రులు జింబో, అలిశెట్టి ప్రభాకర్‌, వఝ్ఝల శివకుమార్‌, పి.ఎస్‌.రవీంద్రలతో కలిసి తొలుత ‘లయ’ (1981) మినీ కవితా సంకలనం ప్రచురించారు. ‘మానేరు టైమ్స్‌’ లో రెండేళ్ళపాటు ఆయన రాసిన పొయిట్రీ కాలమ్‌ ‘మానేరు తీరం’ (1990), 37మంది ప్రముఖుల ప్రొఫైల్‌ ఆర్టికల్స్‌ ఉన్న ‘మానేరు గలగల’ సాహిత్య వ్యాసాల సంపుటితోపాటు, ‘మెరుపు’....యాభైమంది ఉత్తర తెలంగాణ సాహిత్యవేత్తల ఇంటర్వ్యూలు, ప్రముఖ హిందీ కవి గుల్జార్‌ ‘గ్రీన్స్ పోయెమ్స్‌’కు ఆనంద్‌ అనువాదం ‘గుల్జార్‌ ఆకుపచ్చ కవితలు’ పుస్తకాలుగా వెలువడ్డాయి. 
ఆనంద్‌గారి తొలి కవితా సంపుటి ‘మనిషి లోపల’ (2015). మానవసంబంధాలకు, మనిషిలోని ఆర్తికి ప్రతిబింబమిది. బొడ్ల అనూరాధ దీనిని Signature of Love (2016)గా ఆంగ్లంలోకి అనువదించారు. ఇదే పుస్తకాన్ని తమిళ కవి చంద్రమనోహరన్‌ ‘Anpinkaichaantha’ పేరిట తమిళంలోకి అనుసృజించగా, ఎస్‌.డి.కుమార్‌ కన్నడంలోకి అనువదించారు.
56కవితలున్న ఆయన రెండో కవితా సంపుటి ‘అక్షరాల చెలిమె’ (2017).బతుకు పాఠమే ఈ కవితా సంపుటి ప్రధానవస్తువు. ‘పైడి జయరాజ్‌’, ‘మిద్దె రాములు’పై మోనోగ్రాఫ్ (2018)లు కూడా రాశారాయన. ప్రస్తుతం ప్రస్తుతం పిల్లల ‘ముక్తకాలు’ రాస్తున్నారు.