1991 ఫిబ్రవరి 23-24 అర్ధరాత్రి కునన్‌ పోష్పోరా అనే గ్రామంలో వందమందికి పైగా కశ్మీరీ స్త్రీలపై అత్యాచారం జరిగింది. భద్రతాదళాల అఘాయిత్యంపై ఆ స్త్రీల న్యాయ పోరాటం ఫలించలేదు, ఎవరికీ శిక్ష పడలేదు. ఇరవై ఏళ్ళ తర్వాత, 2012లో నిర్భయ ఘటన సందర్భంగా భారత ప్రజల స్పందనను గమనించిన ఐదుగురు కశ్మీరీ యువతులు- ఆనాడు కుషన్‌ పోష్పోరా గ్రామంలోని స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని అందరి ముందుకూ తేవాలనుకున్నారు. వారు సమాచార చట్టం ద్వారా సంపాదించిన వివరాలతోను, బాధితులు సాక్షుల ఇంటర్వ్యూలతోను, తమ సొంత అను భవాలను జోడిస్తూ, ‘డూ యు రిమెంబర్‌ కునన్‌ పోష్పోరా’ అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని పర్‌స్పెక్టివ్స్‌ పబ్లిషర్స్‌ తెలుగులోకి తెచ్చారు. ల.లి.త అనువాదం చేశారు, రమాసుందరి సంపాదకత్వం వహించారు. ఈ సందర్భంగా రమాసుందరితో ‘పలకరింపు’ ఇది..

 

ఈ పుస్తకంలో 90ల నాటి కశ్మీర్‌ కల్లోలిత వాతా వరణంలో పుట్టిపెరిగిన అయిదుగురు యువ రచయిత్రులు తమకు కశ్మీర్‌ సమస్య మీద వున్న అవగాహనను తెలియజేయటంలో ఎంతవరకూ సఫలులయ్యారు?

1991లో కశ్మీర్‌ సరిహద్దు జంటగ్రామాలైన కునన్‌ పోష్పోరాలలో దాదాపు 100మంది మహిళలను అత్యా చారం చేసింది సైన్యం. మిలటరైజేషన్‌ కింద ఉన్న ఆ భూభాగంలో బాధితులకు న్యాయం అందించటంలో అక్కడి అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. కల్లోలిత ప్రాంతా లలో, కాలాల్లో పుట్టి పెరిగిన పిల్లల భవిష్యత్తును తల్లి దండ్రులు కాకుండా, అక్కడి పరిస్థితులు నిర్దేశిస్తాయి. అలాగే ఈ రచయిత్రులు ఎస్సార్‌ బతూల్‌, ఇఫ్రా భట్‌, సమ్రీనా ముస్తాక్‌, మునాజా రషీద్‌, నతాషా రాథర్లు- సామాజిక జీవితాన్ని ఎన్నుకొన్నారు. వారందరూ ‘జమ్మూ కశ్మీర్‌ పౌర సమాజ కూటమి’ అనే శ్రీనగర్‌ కేంద్రంగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నారు. అబద్ధాలను అల్లటానికి అట్టహాసం కావాలి కానీ, వాస్తవాన్ని వెలుగులో తీసుకొని రావటానికి వారికి ఉన్న నిజాయితీ, ఆవేదనా, చిత్తశుద్ధీ సరిపోతాయి. వాటితోనే వాళ్లు ఈ పుస్తకాన్ని అద్భుతంగా మలిచారు.

 

కునన్‌ పోష్పోర ప్రాసంగికత ఇప్పుడు ఏమిటి? ‘జ్ఞాపకం మనది’ అని నొక్కి చెబుతున్న ఈ పుస్తకం ఉద్దేశ్యం ఏమిటి?

పగా, ప్రతీకారాలను తీర్చుకోవటానికి స్త్రీల శరీరాలు యుద్ధభూములుగా మారుతున్న సందర్భాలు, ప్రజలపై శత్రుపక్షంగా ప్రభుత్వమే వ్యవహరిస్తున్న సందర్భాలు కను మరుగు అవనంత కాలం ‘కునన్‌ పోష్పోర’కు ప్రాసంగి కత ఉంటుంది. సామాజిక దురన్యాయాలు జరిగినపుడు, సామూహిక జ్ఞాపకాలు విస్మృతికి గురి అయితే బాధితు లకు ఎన్నడూ న్యాయం జరగదు. అది జరగకూడదని దాదాపు 30 ఏళ్లనాటి శిథిలాలను వాళ్లు వెలికి తీశారు. నిజాన్ని ప్రపంచానికి చాటటమే ఈ పుస్తక ఉద్దేశ్యం.

 

ఉత్తమస్థాయిలో క్షుణ్ణంగా సాగిన ఈ నిజనిర్ధారణ పరిశోధనా శకలం కశ్మీరీ ప్రజల మీద సాధారణంగా ఇండియాలో ఉండే తేలిక అభిప్రాయాలను ఎంత వరకూ తగ్గించగలదు?

కశ్మీర్‌ భారతదేశంలో ఆంతర్భాగమని భావించే వాళ్లు కునాన్‌ పోష్పోరా, ఇంకా అక్కడ జరిగిన అనేక వ్యథలను తమవిగా భావిస్తారా అనే ప్రశ్న కీలకమైంది. ఈ పుస్తకంలో అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని అంగీకరిస్తే- సైన్యాని కిస్తున్న అపరిమితమైన అధికారాలు, కశ్మీర్‌ విముక్తి పోరా టాన్ని అణచటానికి ఆనాటి నుండే ఎలా ఉపయోగప డుతున్నాయో అనే విషయాన్నయినా అంగీకరించగలరు. అక్కడి స్త్రీల హక్కుల ఉల్లంఘన నుండి అయినా కశ్మీర్‌ పరిస్థితిని అర్థం చేసుకొంటారు.